తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 ఇటీవలె ముగిసింది. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు.. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు గద్దెలపైకి వచ్చినప్పుడు లక్షలాది మంది జనం వచ్చి దర్శనాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వార్త పెను సంచలనం సృష్టించింది. మేడారం జాతరకు వచ్చిన ఓ బాలికను.. కొందరు దుండగులు మాయమాటలు పెట్టి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయలేదంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారం కాస్తా జాతీయ మహిళా కమిషన్ వద్దకు వెళ్లింది. అయితే ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న నేషనల్ ఉమెన్ కమిషన్.. ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీ తాజాగా మేడారం చేరుకుని.. అక్కడ పరిశీలించింది. మేడారం జాతరలో ఎక్కడా బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలలేదని జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీ స్పష్టం చేసింది. కమిషన్ సభ్యులు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ గురువారం మధ్యాహ్నం ములుగుకు చేరుకుని విచారణ చేపట్టి నిజానిజాలు రాబట్టింది.
ఆ తర్వాత ములుగు కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకరం.. ఎస్పీ రామ్‌నాథ్ కేకన్‌తో నేషనల్ ఉమెన్ కమిషన్ ఎంక్వైరీ కమిటీ సమావేశమై.. ఈ విషయంపై చర్చించింది. అదే సమయంలో గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆరోపిస్తున్న ప్రాంతాన్ని కూడా కమిటీ సభ్యులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించారు. అయితే జాతరలో అలాంటి ఘటన జరగలేదని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసుల నుంచి లిఖిత పూర్వక నివేదికను కోరింది. పోలీసుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. దాని ఆధారంగా జాతీయ మహిళా కమిషన్‌కు ఈ విచారణ కమిటీ తుది రిపోర్టును సమర్పించనుంది.
జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరిగింది. ఈ జాతరలో భాగంగానే అమ్మవార్ల దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అక్కడే ఉన్న మామిడితోటలోకి బాత్రూంకు వెళ్లిన బాలికను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు యువకులు అడ్డగించి.. అక్కడే సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగింది.
ఈ ఘటన తర్వాత ఆ యువకులు జంపన్నవాగు సమీపంలోని ఒక దుకాణంలో దాక్కున్నారని.. అనంతరం వారిని పోలీసులు తీసుకువెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను ఇప్పటికే ములుగు ఎస్పీ రామ్‌నాథ్ సుధీర్ కేకర్ కొట్టిపారేశారు. జాతరలో అలాంటి ఘటన ఏదీ జరగలేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa