మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామంలో సుమారు ఐదు దశాబ్దాల నాటి ఇళ్ల స్థలాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. గత 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటివరకు శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
అప్పట్లో తాశీల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగానే తాము నివాసాలు ఉంటున్నామని, కొందరు ఇక్కడే పక్కా ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారని లబ్ధిదారులు ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. అయితే, ప్రస్తుతం సదరు భూమి యజమానుల వారసులు రంగ ప్రవేశం చేసి, ఈ భూమి తమదేనంటూ పనులను అడ్డుకుంటున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. పదుల సంఖ్యలో ఏళ్లు గడుస్తున్నా తమకు భూమిపై పూర్తి హక్కులు కల్పించకపోవడం వల్లే ఇప్పుడు ఈ సమస్య ఎదురవుతోందని వారు వాపోయారు.
ఈ సమస్యపై అంబేద్కర్ సేవాసమితి ప్రతినిధులు కూడా స్పందిస్తూ, పేదలకు కేటాయించిన భూములను కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందించి, వారి స్థలాలపై వారికే పూర్తి అధికారం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ యజమానుల వారసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
వినతి పత్రం స్వీకరించిన తహశీల్దార్, ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాత రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పెద్ద సంఖ్యలో నాగ్సాన్‌పల్లి గ్రామస్తులు, మహిళా లబ్ధిదారులు పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa