ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు,,,,ఉత్తర భాగం పనులపై త్వరలోనే టెండర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 07:35 PM

తెలంగాణ గేమ్ ఛేంజర్‌గా హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత కీలకమైన ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భావిస్తోంది. ఆర్ఆర్ఆర్‌తో పాటు పలు జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణే ప్రధాన అడ్డంకిగా మారింది.


హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనులు ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1,895 హెక్టార్ల భూమి అవసరం. కాగా ఇప్పటికే 1,862 హెక్టార్లకు సంబంధించి 3డీ నోటిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో.. మరోసారి టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే నగరం చుట్టూ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.


రాష్ట్రంలో కేవలం రీజినల్ రింగు రోడ్డే కాకుండా, మరిన్ని కీలక జాతీయ రహదారుల పనులు కూడా భూసేకరణ గండం దాటాల్సి ఉంది. ఆర్మూర్ నుండి మంచిర్యాల వరకు, మహబూబ్‌నగర్ పరిధిలో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జగిత్యాల- మంచిర్యాల, మహబూబ్‌నగర్‌- గూడెబల్లూర్, ఆర్మూర్‌- జగిత్యాల, జగిత్యాల- కరీంనగర్ ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు రహదారుల కోసం మొత్తం 1,372 హెక్టార్ల భూమి అవసరం. ఇప్పటి వరకు కేవలం 255 హెక్టార్లు మాత్రమే సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉండటం ప్రాజెక్టుల నిర్మాణం ఆటంకంగా మారింది.


జగిత్యాల-కరీంనగర్ రహదారి విస్తరణకు సంబంధించి రైల్వే శాఖ నుంచి రావాల్సిన అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ రహదారుల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. పనుల పర్యవేక్షణ కోసం త్వరలోనే కన్సల్టెన్సీ సంస్థలను ఎంపిక చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ డిసైడ్ అయింది. భూసేకరణ కొలిక్కి వస్తేనే కన్సల్టెన్సీల నియామకం, క్షేత్రస్థాయి పనులకు అడ్డంకులు తొలిగిపోతాయని అధికారులు చెబుతున్నారు.


కేంద్రం ఈ ప్రాజెక్టుల కోసం భారీ నిధులను కేటాయించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ఎంత వేగంగా పూర్తి చేస్తుందనే దానిపైనే వీటి భవితవ్యం ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు. భూసేకరణ పూర్తయి, క్లియరెన్స్ లభిస్తేనే కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం మారడమే కాకుండా.. జిల్లాల మధ్య కనెక్టివిటీ కూడా పెరుగుతుందని అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa