ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల క్లీన్‌చిట్ రావడంతో బిగ్ రిలీఫ్‌గా భావిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత .. తన కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేసిన నేపథ్యంలో.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొండకు కాలినడకన వస్తానని మొక్కుకున్న కవిత.. తాజాగా తిరుమల వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కల్వకుంట్ల కవితకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే జై ఆంధ్ర అంటూ నినాదాలు చేసిన కవిత.. తన కొత్త పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో తాను మరో 2 నెలల్లో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు కవిత తిరుమల వేదికగా ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీని పెట్టేందుకు రెడీ అయినట్లు మరోసారి వెల్లడించారు. తన కుమారుడితో కలిసి అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమల కొండకు కవిత బయలుదేరారు. ఈ సందర్భంగా అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడిన కవిత.. కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీని తెస్తామని తెలిపారు.
తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పాత్ర పోషించి పోరాటం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా విఫలం అయ్యాయని కవిత ఆరోపించారు. తమ కొత్త పార్టీ నినాదం తెలంగాణ ఫస్ట్ అని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రా ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని తెలిపిన కవిత.. రాజకీయ ఆధిపత్యాన్నే తాము వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా పేద ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. పెద్దోళ్లకు మాత్రం హైడ్రా చుట్టం అయ్యిందని విమర్శించారు. తాను ఎప్పుడూ పేదల పక్షాన పోరాడతానని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన కవిత.. తనకు న్యాయం చేసిన న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు అని తెలిపారు. తాను చేయని తప్పుకు.. గత 4 ఏళ్లుగా తాను, తన కుటుంబ సభ్యులు మానసిక వేదన అనుభవించామని తెలిపారు. దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టేసిందని పేర్కొన్నారు. కేసు నుంచి రిలీఫ్ వస్తే కాలినడకన తిరుమల కొండకు వస్తానని తాను మొక్కుకున్నాని.. ఆ మొక్కు తీర్చుకొనేందుకు వచ్చినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa