ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. నేడు 6 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 07:58 PM

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే భగభగలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఉదయం 8 దాటితే చాలు మండే ఎండలతో కాలు బయటపెట్టలేని పరిస్థితి. సాధారణంగా మార్చి మూడో వారం తరువాత ఎండల తీవ్రత పెరుగుతుంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచే సూర్యుడు చుక్కలు చూపుతున్నాడు. ఈ ఏడాదిలో తొలిసారి గురువారం (మార్చి 5) ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. ఆదిలాబాద్‌ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్‌ ప్రాంతాల్లోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీల సెల్సియస్‌పైన ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత రెండ్రోజులుగా చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని చెప్పారు.


నేడు 6 జిల్లాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. వీటిలోనూ మహబూబాబాద్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధికంగా నమోదవుతాయని చెబుతున్నారు. మార్చి 20లోపు గత పదేళ్లలో అత్యధికంగా 2022 మార్చి 18న నల్గొండలో 43.5, భద్రాచలంలో 42.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు తెలిపారు.


ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు వేడి గాలులు వీస్తున్నాయని తెలిపారు. గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉంటుండటం వల్లే ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరుగుతున్నాయని చెప్పారు. ఇక ఎండల తీవ్రత నుంచి ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. శరీరంగా డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు, పండ్ల రసాలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణిలు, అనారోగ్యంతో ఉన్నవారు వడదెబ్బకు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున చల్లని ప్రాంతాల్లో సేదతీరాలని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa