ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. టారిఫ్‌ల పెంపు ఉండబోదని వెల్లడించిన ఈఆర్‌సీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 06:04 PM

విద్యుత్ ఛార్జీల పెంపు పై జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) క్లారిటీ ఇచ్చింది. ఈ ఛార్జీల పెంపు ఊహాగాలను కొట్టిపారేసిన ఈఆర్సీ.. ఈసారి ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపును తాము ప్రతిపాదించలేదని తేల్చి చెప్పింది. 2026-27 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపు గానీ.. టైమ్ ఆఫ్ ద డే ఛార్జీల పెంపు గానీ ఉండదని అధికారికంగా ఈఆర్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాదికి సుమారు రూ.50,242 కోట్ల ఆదాయం అవసరం అవుతుందని ఈఆర్సీ అంచనా వేసింది. ప్రస్తుత విద్యుత్ ఛార్జీల ద్వారా రూ.40,659 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని వివరించింది.


ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.9,583 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేసింది. అయితే ఈ రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా మద్దతు కల్పించాలని తాము భావిస్తున్నట్లు తెలంగాణ ఈఆర్సీ తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వ్యయాలు భారీగా పెరిగిపోయినప్పటికీ.. ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా ఈ లోటును ప్రభుత్వం భరించనుందని స్పష్టం అవుతోంది.


ఇక తెలంగాణలో విద్యుత్ డిమాండ్ , వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎస్‌పీడీసీఎల్ (SPDCL) పరిధిలో గతేడాదితో పోలిస్తే సుమారు 12 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం కనెక్టెడ్ లోడ్ 35,175 MVA (మెగావోల్ట్ ఆంపియర్స్‌కు) చేరుకుందని.. అదే సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 20,975 మెగావాట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. విద్యుత్ వినియోగం పరంగా చూస్తే తెలంగాణలో 31 శాతంతో పారిశ్రామిక రంగం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 23 శాతంతో గృహ రంగం రెండో స్థానంలో.. వ్యవసాయ రంగం 21 శాతం వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది.


విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతున్నప్పటికీ.. నిరంతరంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేసేందుకు తాము రెడీగా ఉన్నట్లు విద్యుత్ అధికారులు భరోసా ఇచ్చారు. మరోవైపు.. డిస్కంల పనితీరులో కూడా గణనీయమైన పురోగతి కనిపిస్తోందని తెలుస్తోంది. విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలను 9.60 శాతం నుంచి 8.04 శాతానికి తగ్గించడంలో ఘన విజయం సాధించారు. అదే సమయంలో విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా ఒకప్పుడు యూనిట్‌కు రూ.6.35 ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.5.54కు తగ్గించడం గమనార్హం.


మరోవైపు.. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గృహజ్యోతి పథకం .. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు ఒక గొప్ప వరంగా మారింది. ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 30 శాతం గృహ విద్యుత్ వినియోగదారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి విద్యుత్ శాఖ 5.44 కోట్ల జీరో బిల్లులను జారీ చేసింది. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1930.66 కోట్ల సబ్సిడీని విడుదల చేసినట్లు తెలిపింది. ఇక ఈ గృహజ్యోతి పథకం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ చౌర్యం కూడా భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa