ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు బెయిల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 06:08 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మెయినాబాద్ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు స్టేషన్ బెయిల్ మంజూరయ్యింది. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. టీడీపీ ఎంపీతో పాటు ప్రియాంక రెడ్డికి బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీని శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో ఈగల్ టీమ్, ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ మహేశ్ కుమార్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.


శనివారం రాత్రి పోలీసుల రాకను గమనించిన పార్టీలో ఉన్న యువకులు వారిని అడ్డుకుని నానా హంగామా సృష్టించారు. ఈ సమయంలో 2 గ్రాముల కొకైన్‌తో పాటు ఒక తుపాకీ పట్టుబడింది. అయితే, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నమిత్ శర్మ కాల్పుల జరిపిన గన్ లైసెన్స్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి పేరు మీద ఉందని చెప్పారు.


ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి సహా పది మంది పేర్లు ఉన్నాయి. పట్టుబడిన వారికి తమ వద్ద ఉన్న డ్రగ్ టెస్టు కిట్ ద్వారా పోలీసులు పరీక్ష నిర్వహించగా.. అర్జున్ రెడ్డి, కౌషిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది. అయితే, ర్యాపిడ్ టెస్ట్ టీడీపీ ఎంపీకి నెగిటివ్ వచ్చింది. కానీ, ఆదివారం ఉదయం రక్త నమూనాలను పరీక్షించగా టీడీపీ ఎంపీ కూడా డ్రగ్స్ వాడినట్లు నిర్దారణ అయ్యింది. ఫామ్‌ హౌస్‌ వద్ద రెండు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa