ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 06:21 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 2,764 మంది లబ్ధిదారులకు సంబంధించి సుమారు రూ.28.50 కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేశారు. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం కీలక ప్రకటన చేశారు. 99 రోజుల కార్యక్రమం మొదటి వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజా ప్రాలన ప్రగతి ప్రణాళికలో మొదటి వారం రోజుల పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఎండీ వీపీ గౌతం వెల్లడించారు.


ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించామని.. నిశితంగా పరిశీలించి బిల్లులు క్లియర్ చేశామని ఎండీ వీపీ గౌంతం వివరించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గతవారం రోజుల్లో క్లియర్ చేసిన బిల్లులలో ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి సంబంధించి మెుత్తం రూ.12.06 కోట్ల విడుదల చేశామన్నారు. బిల్లులు విడుదలైనప్పటికీ వివిధ కారణాలతో బ్యాంక్ వద్ద పేమెంట్ ఫెయిల్ అయిన 653 మంది లబ్ధిదారులకు చెందిన రూ.7 కోట్ల మేర మొత్తాన్ని సైతం విడుదల చేసినట్లు ఆయన వివరించారు. వీటితో పాటు పలు అభ్యంతరాలు, నిశిత పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉన్న మరో 911 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.9.40 కోట్లను కూడా విడుదల చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.


కాగా, పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. మెుత్తం 4 విడతల్లో ఆ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మెుత్తం 4 లక్షల ఇళ్లను పేదలకు మంజూరు చేశారు. తాజాగా రెండో విడత ఇళ్ల కేటాయింపుకు సిద్ధమవుతోంది. ఏఫ్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa