2018 తర్వాత గబ్బర్ టెస్టు జట్టులోకి రాలేదు. 2019లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడిన ధావన్.. తాజాగా రంజీల్లో ఆడడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. గతేడాది వరకు వన్డేల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న ధావన్.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనల్లో ఘోరంగా విఫలం కావడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. టెస్టుల్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ ఐదేళ్ల క్రితం ధావన్‌ను జట్టు నుంచి తప్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధావన్ తిరిగి భారత్ తరఫున ఆడడం ఓ అద్భుతం, టెస్టుల్లో చోటు దక్కించుకోవడం అతిశయోక్తి. ధావన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే రంజీలు కూడా ఆడడం లేదని చెప్పాడు. ధావన్ ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నాకు రంజీలు ఆడటం గురించి పెద్దగా ఆలోచన లేదు. నా టెస్ట్ కెరీర్ గురించి నాకు తెలుసు. గత నాలుగేళ్లుగా నేను టెస్టు జట్టులో లేను. వయస్సు కూడా ఒక ముఖ్యమైన అంశం కావచ్చు. క్రీడాకారుల కెరీర్ ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సెలక్టర్లు కూడా యువ ఆటగాళ్లపై దృష్టి సారిస్తున్నారు. నా మీద కాదు అని అన్నాడు.