ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టు 109 పరుగులకే ఆలౌటవడంతో ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 156/4 ఓవర్‌నైట్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియాకు పీటర్ హ్యాండ్‌స్కాంబ్ మరియు కామెరాన్ గ్రీన్ శుభారంభం అందించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో తొలి గంటలో టీమ్‌ఇండియా వికెట్ లేకుండా పోయింది. 98 బంతుల్లో ఫోర్‌తో 19 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి హ్యాండ్‌కాంబ్ ఔటయ్యాడు. ఆపై ఉమేష్ యాదవ్ మ్యాజిక్ చూపగా... 57 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన కెమెరాన్ గ్రీన్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్‌ను 1 పరుగు వద్ద ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా... అలెక్స్ కారీ 3 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. టాడ్ మర్ఫీని ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేసిన వెంటనే ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోగా... 5 పరుగులు చేసిన నాథన్ లియాన్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది.