వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవం సందర్భంగా స్వామివారి ఖజా నాకు రూ. 3. 7 కోట్ల ఆదాయం సమకూరింది. చందనోత్సవం రోజున దేవస్థానం ఉచిత దర్శనంతో పాటు రూ. 300, రూ. 1000, రూ. 1500 టికెట్లు ముద్రించి విక్రయాలు జరిపారు. వీటి ద్వారా మొత్తం రూ. 3. 74 కోట్లు ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. కాగా తొలిసారి చందనోత్సవ టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపారు. ఆ క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల కొందరు భక్తుల సొమ్ము దేవస్థానానికి జమైంది కాని టికెట్లు రాలేదు. ఈ క్రమంలో తమ సొమ్ము వాపసు ఇవ్వాలని పలువురు ఇప్పటికీ దేవస్థానానికి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. చందనోత్సవ టికెట్ల ముద్రణ, విక్రయాల సంఖ్యపై విచారణ జరిగినప్పటికీ అటు జిల్లా జాయింట్ కలెక్టర్ నివేదిక, దేవదాయ శాఖ అదనపు కమిషనర్ నివేదికలోని అంశాలు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. మరోవైపు చందనోత్సవ టికెట్ల గందరగోళానికి, ఉత్సవ వైఫల్యానికి కారకులైన వారిని గుర్తించడంలోనూ, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.