బ్యాంకింగ్ రంగంలోనూ పోటీ తీవ్రంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవాలంటే తమ కస్టమర్లను కాపాడుకోవడం కూడా బ్యాంకులకు ఎంతో కీలకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్ల కోసం ప్రత్యేక స్కీమ్స్ తీసుకొస్తున్న సంగతి తెలిసింది. ఆయా పథకాల్లో చేరిన వారికి గరిష్ఠ ప్రయోజనం చేకూరనుంది. అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ముందుటాయి. ప్రస్తుతం ఎఫ్‌డీ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి. అయితే, ముందు ముందు తగ్గిపోయే అవకాశం ఉంది. మరోవైపు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు గరిష్ఠ వడ్డీ అందించే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ఈనెల చివరితో ముగిసిపోనున్నాయి. అందుకే ఎస్‌బీఐ కస్టమర్లు మంచి రాబడి కోరుకుంటున్నట్లయితే వెంటనె చేరిపోవడం మంచిది. ఎస్‌బీఐ అమృత్ కలశ్, ఎస్‌బీఐ వీకేర్ ఎఫ్‌డీ పథకాలు జూన్ 30తో గడువు ముగుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎస్‌బీఐ అమృత్ కలశ్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమృత్ కలశ్ పథకం జూన్ చివరితో ముగియనుంది. ఈ స్కామ్ 400 రోజుల టెన్యూర్ కలిగి ఉండి జనరల్ కస్టమర్లకు గరిష్టంగా 7.10 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ లభిస్తోంది. అంటే వారికి అమృత్ కలశ్ స్కీమ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ పథకం ఏప్రిల్ 12, 2023న ప్రారంభించారు. జూన్ 30, 2023తో ముగియనుందని ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎవరైనా గరిష్ఠ వడ్డీ కోరుకుంటే ఇప్పుడే ఈ పథకంలో చేరిపోవడం మంచిది.
ఎస్‌బీఐ వీ కేర్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ఈ ఎస్‌బీఐ వీ కేర్ ఎఫ్‌డీ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం టెన్యూర్ 5 ఏళ్ల నుచి 10 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లక్లు గరిష్ఠంగా 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే, ఈ పథకం సైతం జూన్ 30, 2023 వరకే అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ వీ కేర్ సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను మే, 2020లో ప్రారంభించారు. పలుమార్లు పొడిగించారు. మార్చి 31తోనే గడువు ముగియగా మరోసారి పొడిగిస్తూ జూన్ 30, 2023 చివరి తేదీగా నిర్ణయించింది ఎస్‌బీఐ.
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ..
భారత ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఇండ్ సూపర్ 400 డేస్ త్వరలోనే ముగియనుంది. ఈ ప్రత్యేక పథకం గడువు జూన్ 30, 2023 వరకే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా సాధారణ కస్టమర్లకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది ఇండియన్ బ్యాంక్. మరో 15 రోజుల్లో గడువు ముగిసిపోతున్న క్రమంలో ఎవరైతే ఎక్కువ వడ్డీ కోరుకుంటారో ఇప్పుడే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. తర్వాత ఈ స్కీమ్ ఉండదు. అలాగే.. అందుబాటులో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలల్లోనూ వడ్డీ రేట్లలో కోత పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.