ఎక్కడో ఆర్తిక మాంధ్యం వస్తే మన దేశంలో ప్రభావం చూపుతుందా అంటే ఐటీ రంగ పరిస్థితులు చూస్తే అవుననే చెప్పాలి. యూఎస్, యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇది ఐటీ రంగంపై పెను ప్రభావం చూపిస్తోంది. మన దేశంలో ఐటీ సేవల రంగంపైనా ఈ ప్రభావం పడుతోంది. అందువల్ల ఐటీ ఉద్యోగాలు చేసే వారే కాక.. ఐటీ ఉద్యోగాల కోసం చూసేవారికి కూడా కష్టంగా ఉంది. నియామకాలు తగ్గిపోతున్నాయి. ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ ఫర్మ్ నౌక్రీ.కామ్ తాజాగా నౌక్రీ జాబ్‌స్పీక్- మే 2023 పేరుతో ఒక రిపోర్ట్ వెల్లడించింది. 2022 మే నెలతో పోల్చితే గత నెలలో ఐటీ నియామకాలు 23 శాతం తక్కువయ్యాయి. ఎడ్యుకేషన్, రిటైల్, ట్రైనింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు తగ్గాయి. మరోవైపు చమురు, సహజ వాయువు రంగాల్లో మాత్రం ఉద్యోగాలు 31 శాతం పెరగడం విశేషం. బ్యాంకింగ్/ఆర్థిక సేవలు, స్థిరాస్తి రంగాల్లోనూ ఉద్యోగాలు పెరిగినట్లు రిపోర్ట్‌లో తేలింది.
గత కొంత కాలంగా విద్యుత్, ఇంధన వినియోగం ఎక్కువైనందున .. ఆయా రంగాల్లో నియామకాలు మాత్రం పెరుగుతున్నాయి. ఇంకా ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉన్న కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా ఎక్కువయ్యాయి. స్థిరాస్తి ప్రాజెక్టుల నిర్మాణం పెరగడంతో .. ఈ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
ఔషధ రంగంల నియామకాలు పెరగడం మాత్రం ఆసక్తికర పరిణామంగా ఉంది. కరోనా పరిణామాల అనంతరం ఈ రంగం ఒక్కసారిగా వెనుకబడింది. ఉత్పత్తి కార్యకలాపాలు కూడా మందగించిన నేపథ్యంలో.. కొత్త ఉద్యోగుల అవసరాలు భారీగా తగ్గిపోయాయి. అయితే.. కొత్త విభాగాల్లో మెడిసిన్ తయారీ ప్రారంభించడంతో.. కొత్త మార్కెట్లకు చేరేందుకు.. మళ్లీ ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు పెరుగుతున్నాయి.
నగరాల వారిగా చూస్తే అహ్మదాబాద్, వడోదరా, జైపుర్, దిల్లీ, ముంబై నగరాల్లో కొత్త నియామకాలు పెరిగిపోయాయి. ఐటీ సేవల రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలతో పాటు చెన్నై, పుణె, చండీగఢ్, కోయంబత్తూర్, కోల్‌కతా, కొచ్చి నగరాల్లో సరికొత్త ఉద్యోగాల సంఖ్య మాత్రం తగ్గిపోయింది.
ఇంకా ఫ్రెషర్స్‌తో పోలిస్తే.. ఆయా రంగాల్లో మంచి నైపుణ్యం, అనుభవం బాగా ఉన్న వారికి మాత్రం ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజా ఉత్తీర్ణులకు (ఫ్రెషర్స్), ఇంకా ఏడేళ్ల లోపు అనుభవం ఉన్న వారికి ఉద్యోగాలు దొరకడం కాస్త కష్టంగా ఉంది. అంటే దీనిని బట్టి.. అనుభవం (ఎక్స్‌పీరియెన్స్) అవసరమైన ఉద్యోగాల సంఖ్య పెరుగుతోందని స్పష్టమవుతుంది. 13 నుంచి 16 సంవత్సరాలు.. అంతకుమించి అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి.