ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఉద్యోగులకు 2024 మే- జులై కి సంబంధించి డీఏ ప్రకటించింది. 15.97 శాతంగా నిర్ణయించింది. గతంలో కంటే పెంచింది. ఈ మేరకు 2024, జూన్ 10న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఇక ఉద్యోగులకు డీఏ ను ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ -2016 ను బేస్‌గా తీసుకొని నిర్ణయిస్తుంటుంది. ఈ లెక్కన 2016 సీపీఐ 123.03 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇక ప్రతి త్రైమాసికం 3 నెలల సగటు ద్రవ్యోల్బణం నుంచి దీనిని తీసేస్తే అది డీఏ అవుతుంది.
2024 మార్చితో ముగిసిన త్రైమాసికంతో చూస్తే.. జనవరి 2024లో ఇది 138.9 గా ఉంది. ఫిబ్రవరిలో 139.2, మార్చిలో 138.9 గా ఉంది. ఈ లెక్కన మూడు నెలల సగటు ద్రవ్యోల్బణం 139 గా ఉంది. బేస్ రేటు అయిన 123.03 కంటే ఇది 15.97 పాయింట్లు ఎక్కువ. అంతకుముందు త్రైమాసికంలో 138.76 సీపీఐగా ఉండగా.. దీనితో పోలిస్తే డీఏ 0.24 శాతం మేర పెరిగిందని చెప్పొచ్చు.
జీతాలు పెంపు..
ఇక 2024 మార్చి నెలలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల (పీఎస్ యూ) ఉద్యోగులకు జీతాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇది దాదాపు 17 శాతం మేర పెరిగింది. మరోవైపు బ్యాంక్ ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్న మరో ప్రధాన డిమాండ్ వారంలో 5 రోజుల పని. అంటే ప్రస్తుతానికి ప్రతి రెండో, నాలుగో శనివారాలు మాత్రమే సెలవు ఉండగా.. ఉద్యోగులు అన్ని శనివారాలూ సెలవు కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు దీనికి అంగీకారం తెలిపినట్లు గతంలోనే వార్తలొచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోం మాత్రం ఇంకా లభించలేదని తెలిసింది.
5 రోజుల పనిపై..
బ్యాంకు ఉద్యోగుల వారంలో 5 రోజుల పనికి సంబంధించి ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), బ్యాంక్ యూనియన్లు అంగీకారానికి వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఒక్కటే పెండింగ్‌లో ఉంది. ఇక ప్రతి శనివారం కూడా సెలవు పాటిస్తే.. అప్పుడు మిగతా రోజుల్లో వర్కింగ్ అవర్స్ స్వల్పంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఈ సమయం ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంది.