స్టార్టప్ సంస్థలకు అత్యంత అనుకూలమైన నగరాల్లో హైదరాబాద్ సత్తా చాటింది. తొలిసారి స్థానం సంపాదించింది. ఆసియా దేశాల్లోని నగరాల్లో స్టార్టప్ కంపెనీలకు అనుకూల పరిస్థితులు, సానుకూలతలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా స్టార్టప్ జీనోమ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ మేరకు ఆసియా దేశాల్లోని నగరాలపై 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనే రిపోర్ట్ తయారూ చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్ 19వ స్థానంలో నిలిచింది. అయితే ఈ లిస్ట్‌లో సింగపూర్ తొలి స్థానంలో నిలవగా.. మన దేశంలో బెంగళూరు 6వ స్థానం, ఢిల్లీ 7వ స్థానం, ముంబై 10వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ తర్వాత పుణె నగరం 26వ స్థానంలో నిలిచింది.
ప్రధానంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రిపోర్ట్ తయారు చేసింది జీనోమ్ సంస్థ. స్టార్టప్ సంస్థల సామర్థ్యం, నిధుల లభ్యత, మానవ వనరుల నైపుణ్యాలు- అనుభవాలు, మార్కెట్‌కు దగ్గర కావడం, విజ్ఞానం వంటి అంశాలు ఉన్నాయి. దశాబ్దకాలం క్రితం హైదరాబాద్ నగరంలో అంకుర సంస్థలు కేవలం 200 ఉండేవి. ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలోనే స్టార్టప్ సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు దాదాపుగా 7,500 లకు పైగా స్టార్టప్ సంస్థలకు హైదరాబాద్ నగరం కేంద్ర స్థానంగా ఉంది. త్వరలోనే ఈ సంఖ్య పది వేలకు చేరుకునే అవకాశం ఉంది. యూనికార్న్ హోదా పొందిన అంకుర సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉండడం ప్రత్యేకత.
హైదరాబాద్ నగరానికి మరో ప్రత్యేకత సైతం దక్కింది. ఆసియా దేశాల్లో అంకుర సంస్థలకు బెస్ట్ ఎమర్జింగ్ ఎకోసిస్టమ్ ఉన్న నగరాల జాబితాలోనూ హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ప్రాథమిక దశలో ఉన్న స్టార్టప్ సంస్థలు సత్వం ఎదిగేందుకు దోహదపడే పరిస్థితులు హైదరాబాద్‌లో ఉండటాన్ని ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆసియాలో తొలి స్థానంలో నిలిచిన సింగపూర్ నగరం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 7వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ జాబితాలో అమెరికాలోని సిలికాన్ వాలీ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత న్యూయార్క్, లండన్ నగరాలు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి.