ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరోసారి బడ్జెట్ సమర్పించనున్నారు. ఇప్పుడు ఈ ఆర్థిక ఏడాది 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ తయారీ ప్రక్రియ మొత్తం 72 మంది మంత్రిలు పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదలు కానుంది. మరోసారి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కే మోదీ సర్కార్ అవకాశం కల్పించింది. దీంతో ఆమె వచ్చే జులైలో 6వ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత ఇప్పుడు అందిరి ఫోకస్ కేంద్ర బడ్జెట్ 2024-25పైనే ఉంది. ప్రత్యేక పన్ను చెల్లింపుదారులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రానున్న పూర్తి స్థాయి బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తమకు పన్ను ఉపశమనం కల్పించాలని ఎదురుచూస్తున్నారు. అలాగే ఆర్థిక నిపుణులు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ మినహాయింపుల్లో సవరణలు చేయాలని కోరుతున్నారు.
చివరి సారిగా వార్షిక బడ్జెట్ 2014-15లో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీలో సవరణలు చేసింది ప్రభుత్వం. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపుల పరిమితి రూ.1 లక్ష ఉండగా దానిని రూ.1.5 లక్షలకు పెంచింది. మధ్య తరగతి ప్రజలకు సెక్షన్ 80సీ అనేది మినహాయింపులు పొందడంలో చాలా కీలకమని చెప్పవచ్చు. ఈ సెక్షన్ ద్వారా పన్ను చెల్లింపుదారులు పీపీఎఫ్, ఎన్‌పీఎస్, పొదుపు పథకాలు, లైఫ్ ఇన్సూరెన్స్, ఈఎల్ఎస్ఎస్, యులిప్స్ , హోమ్ లోన్స్ వంటి వాటిపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందుతున్నారు.
అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక బాధ్యతల కారణంగా సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు లిమిట్ రూ.1.5 లక్షలు అనేది సరిపడా లేదని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో జులై, 2024లో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌లో సెక్షన్ 80సీ పరిమితి పెంచాలని పన్ను చెల్లింపుదారులతో పాటు పన్ను నిపుణులు సైతం కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న లిమిట్ పెంచడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట లభిస్తుందంటున్నారు.
మరోవైపు.. మోదీ ప్రభుత్వం మూడో టర్మ్ అధికారాన్ని చేపట్టిన క్రమంలో పన్ను చెల్లింపుదారులు స్పష్టమైన, సమర్థవంతమైన పన్ను వ్యవస్థ కోసం సంస్కరణలు చేపట్టాలని ఎదురుచూస్తున్నారు. పన్ను స్లాబులను తగ్గిచడం, మినహాయింపులను క్రమబద్ధీకరించడం వంటివి చేపట్టడం ద్వారా ప్రజలకు పన్ను విషయాన్ని సులభతరం చేయాలంటున్నారు. రెండు పన్ను విధానాలు ఉండడం వల్ల ప్రజల్లో అయోమయం నెలకొంటోందని చెబుతున్నారు. ఒకే పన్ను విధానం ఉండాలంటున్నారు. అయితే, జులైలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాల్సిందే.