ప్రస్తుత కాలంలో చాలా మంది తమ సంపాదనలో నుంచి కొంత మొత్తమైనా పెట్టుబడులు రూపంలో పెడుతున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఎల్ఐసీ, పోస్టాఫీస్ పథకాల్లో రిస్క్ ఉండదు కాబట్టి.. మంచి రిటర్న్స్ కోసం దీంట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. దీంట్లో పలు రకాల ప్రయోజనాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఈ స్కీమ్‌ను రిటైర్మెంట్ ప్రణాళికగా ఎంచుకుంటారు. దీనితో వారి ఖాతాలో ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఉంటుంది. ఎల్ఐసీ నుంచి కూడా ఒక ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది మీ రిటైర్మెంట్‌పై మీకు నిర్ణీత మొత్తం అందిస్తుంది.
అందులో ఒకటే ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా పెన్షన్‌కు హామీ ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు.ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్.. రిటైర్మెంట్ ప్లాన్‌గా ప్రాచుర్యం పొందింది. ప్రతి నెలా ఫిక్స్‌డ్ ఇన్‌కం ఇచ్చే ఈ స్కీమ్.. రిటైర్మెంట్ తర్వాత పెట్టుబడి ప్రణాళికకు చక్కగా సరిపోతుంది. ఒక వ్యక్తి ప్రైవేట్ సెక్టార్ లేదా ప్రభుత్వ విభాగంలో పనిచేసి.. పదవీ విరమణకు ముందు తన పీఎఫ్ ఫండ్, గ్రాట్యుటీ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే.. అతను జీవితాంతం ప్రతి నెలా పెన్షన్ బెనిఫిట్స్ పొందుతుంటాడు.
ఈ స్కీమ్ వివరాల విషయానికి వస్తే.. దీంట్లో చేరేందుకు 40 నుంచి 80 సంవత్సరాల వయస్కులు అర్హులు. ఈ పాలసీ కింద నెలకు రూ. 1000 చొప్పున కూడా తీసుకోవచ్చు. త్రైమాసిక ప్రాతిపదికన కనీసం రూ. 3 వేలు, అర్ధవార్షిక ప్రాతిపదికన రూ. 6 వేలు, వార్షిక ప్రాతిపదిన రూ. 12 వేలు కూడా పొందొచ్చు. ఈ ప్లాన్‌లో మీరు ఏడాదికి కనీసం రూ. 12 వేలు వార్షికాదాయాన్ని కొనుగోలు చేయొచ్చు. గరిష్ట పెట్టుబడి ఈ పాలసీ స్కీమ్ కింద ఎలాంటి పరిమితి నిర్ణయించలేదు. మీకు కావాల్సినంత పెట్టుబడి పెట్టడం ద్వారా గరిష్ట పెన్షన్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఏకమొత్త పెట్టుబడి నుంచి యాన్యుటీ కొనుగోలు చేయొచ్చు.
నెలకు 12 వేలు పెన్షన్..
ఎల్ఐసీ కాలిక్యులేటర్ ప్రకారం.. ఎవరైనా 42 సంవత్సరాల వ్యక్తి 30 లక్షల యాన్యుటీ కొనుగోలు చేస్తే.. ప్రతి నెలా రూ. 12,388 పెన్షన్ పొందుతాడు. కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే.. పాలసీ తీసుకున్న 6 నెలల తర్వాత సరెండర్ చేయొచ్చు. పాలసీ ప్రారంభించిన 6 నెలల తర్వాత ఎవరైనా లోన్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ ప్లాన్ కొనుగోలు చేయాలంటే.. www.licindia.in వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.