ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.15 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ రష్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇందులో నగదు రాయితీ, క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజీ బోనస్ వంటివి ఉన్నాయి. అయితే ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అనేది జూన్ 26,2024 వరకే అందుబాటులో ఉంటుందని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్లోనే కొనడం మంచిది.
ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఈ ఆఫర్ పీరియడ్‌లో నేరుగా రూ.5 వేల తగ్గింపు లభిస్తోంది. ఆ పైన క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.5 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. అలాగే రూ. 5 వేల వరకు ఎక్స్చేంజీ బోనస్ అందుబాటులో ఉంది. అలాగే ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారికి రూ.5 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ప్రస్తుతం ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 89,999 గా ఉంది.
ఓలా ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో..
కస్టమర్లు ఓలా ఎస్1 ఎయిర్ లేదా ఓలా ఎస్1 ప్రో కొనుగోలు చేసినట్లయితే వారికి రూ.2,999 విలువైన ఓలా కేర్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. అలాగే వార్షిక సర్వీసింగులు ఉచితంగా అందిస్తోంది. అలాగే ఈ రెండు స్కూటర్లపై క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్లపై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రస్తుతం ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ. 1.05 లక్షలుగా ఉంది. అలాగే ఓలా ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ సెగ్మెంట్‌లో 49 శాతం మార్కెట్ షేరు కలిగి ఉండి అతిపెద్ద ఈవీ మేకర్‌గా నిలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఓలా ఎస్1 ఎక్స్ బ్రాండ్ తక్కువ ధరకే లభిస్తోంది. కనిష్ఠ ధర రూ. 74,999 గా ఉండగా.. గరిష్ఠ ధర రూ. 1 లక్ష (ఎక్స్ షోరూమ్) గా ఉన్నాయి. ఇందులో 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ఎస్1 ఎక్స్ స్కూటర్లపై ఎలాంటి ఆఫర్లు లేవని కంపెనీ తెలిపింది. మరోవైపు.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ త్వరలోనే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కి వస్తోంది. ఇప్పటికే డ్రాఫ్ పేపర్స్ సమర్పించగా సెబీ నుంచి సైతం ఆమోదం లభించింది. రానున్న కొన్ని నెలల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.