చలామణి నుంచి ఉపసంహరించుకున్న పెద్ద నోట్లు రూ.2 వేల కరెన్సీ నోట్లకు సంబంధించి మరోసారి కీలక ప్రకటన చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ. జూన్ 28, 2024 వ తేదీ వరకు రూ.2 వేల నోట్ల గణాంకాలను విడుదల చేస్తూ జులై 1, 2024 రోజున ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 28 వరకు మొత్తంగా 97.87 శాతం మేర రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు తెలిపింది. ఇంకా ప్రజల వద్ద భారీగానే నోట్లు ఉన్నట్లు ఈ ప్రకటనతో అర్థమవుతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పటికీ ఇంకా చలామణిలో అంటే ప్రజల వద్ద సుమారు రూ. 7581 కోట్లు విలువైన 2000 కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 2 వేల నోట్లకు సంబంధించిన గణాంకాలను అప్డేట్ చేసింది. చలామణిలో ఉన్న నోట్లు సంఖ్య గత నెల మే, 2024 తో పోలిస్తే జూన్ చివరి నాటికి 2.29 శాతం మేర పడిపోయినట్లు తెలిపింది. మే, 2024 నెల గణాంకాలు చూస్తే ఇంకా వెనక్కి రావాల్సిన నోట్లు రూ. 7,755 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇప్పటికీ చలామణిలో ఉన్న నోట్లకు చట్టబద్ధత ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. అయితే, వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయ్యాల్లో మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుందని గుర్తుంచుకోవాలి.
మే 19, 2023 రోజున రూ. 2 వేల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన చేసే నాటికి చలామణిలో రూ. 3.56 లక్షల కోట్లు విలువైన రూ. 2 వేల నోట్లు ఉన్నాయి. ఆ తర్వాత అక్టోంబర్ , 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకోవడం, డిపాజిట్లు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చేందుకు వీలు కల్పించింది. నేరుగా వెళ్లలేని వారు పోస్టాఫీసు ద్వారా నోట్లు పంపిస్తే వారి ఖాతాల్లో జమ చేస్తోంది.