స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం వివిధ రకాల పొదుపు, డిపాజిట్ పథకాలు అందిస్తోంది. ఆయా స్కీమ్స్‌లో చేరిన వారికి మంచి బెనిఫిట్స్ కల్పిస్తోంది. మీరు కూడా మీ వద్ద ఉన్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసి స్థిరమైన రాబడి ఉండాలనుకుంటున్నారా? అలాంటి పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఎస్‌బీఐ అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో మీరు డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా గరిష్ఠంగా 10 ఏళ్ల పాటు పెన్షన్ మాదిరిగా స్థిరమైన రాబడి అందుకోవచ్చు.
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా మంచి వడ్డీ రేట్లు సైతం కల్పిస్తోంది. ఇందులో చేరడం ద్వారా ప్రతీ నెల మన అవసరాలకు తగిన విధంగా డబ్బులు వెనక్కి అందుకోవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ యాన్యూటీ స్కీమ్‌లో ఎవరైనా చేరవచ్చు. 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు, ఎంచుకునే టెన్యూర్‌పై ఆధారపడే నెల నెలా డబ్బులు వస్తాయి. మీరు 36, 60,84,120 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీ అవవసరాల తగినంతగా, అనువైన విధంగా మెచ్యురిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు కావాల్సినంత నగదు ప్రతీ నెలా పెన్షన్ మాదిరిగా అందుకోవచ్చు.
ఎస్బీఐ అందిస్తున్న యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో నెలకు కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా పొందేందుకు వీలుంది. అయితే అది మీరు డిపాజిట్ చేసే సొమ్ముపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు యాన్యూటీ పథకంలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యమూ ఉంటుంది. మీ డిపాజిట్ నగదులో 75 శాతం వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందవచ్చు. అలాగే మీరు ఎంచుకునే మెచ్యూరిటీ పీరియడ్, ఆధారంగా అసలులో కొంత, వడ్డీ కలిపి చెల్లిస్తుంది బ్యాంక్. మీరు ఈ యాన్యుటీ స్కీమ్‌లో రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. 10 ఏళ్ల టెన్యూర్ ఎంచుకున్నట్లయితే మీకు నెలకు రూ.11,870 వరకు లభిస్తాయి. మొదటి నెల పేమెంట్‌లో మీకు వడ్డీ రూ. 6250, అసలులో నుంచి రూ.5,620 కలిగి మొత్తంగా రూ.11,870 చెల్లిస్తుంది బ్యాంక్. టెన్యూర్ పూర్తయ్యే సరికి మీ పెట్టుబడి మొత్తం జీరోకు వస్తుంది. మరోవైపు.. ఈ యాన్యుటీ స్కీమ్‌లో డిపాజిట్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీబీ ద్వారా పన్ను మినహాయింపులూ క్లెయిమ్ చేసుకోవచ్చు.