దేశీయ దిగ్గజ టూ వీలర్ తయారీ కంపెనీల్లో ఒకటైన సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా తాజాగా 4 లక్షల స్కూటర్లు, మోటార్ సైకిళ్లను రీకాల్ చేసింది. అంటే 4 లక్షల స్కూటర్లు, బైక్స్‌లో లోపాలు ఉన్నట్లు అర్థం. మీరు కూడా సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా బైక్స్, స్కూటర్ వాడుతున్నట్లయితే రీకాల్ చేసిన మోడళ్లలో మీ బండి ఉందేమో చెక్ చేసుకోవడం మంచింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
సుజుకీ మోటార్ సైకిల్స్ ఇండియా తయారు చేసిన యాక్సెస్ 125 , బర్గ్‌మాన్ స్ట్రీట్, అవెనీస్ 125 మోడళ్లను రీకాల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మానుఫాక్చరర్స్ వెబ్‌సైట్లో ఈ మేరకు రీకాల్ చేసిన మోడళ్లు, ఏందుకు రికాల్ చేసింది అనే పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించింది.
మొత్తం నాలుగు లక్షల వాహనాల్లో అత్యధికంగా 2.63 లక్షల టూ-వీలర్లు సుజుకీ యాక్సెస్ మోడల్‌వే ఉన్నట్లు తెలుస్తోంది. అవెనీస్ మోడల్ బండ్లు 1.25 లక్షలు ఉండగా, బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్లు 72 వేలు రీకాల్ చేసిన వాటిలో ఉన్నాయి. ఇగ్నినిషన్ కాయిల్‌లో వినియోగించే హై-టెన్షన్ కోర్డ్‌లో లోపాన్ని గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. ఈ లోపం తలెత్తిన కారణంగానే రీకాల్ చేపట్టినట్లు పేర్కొంది. 2022, ఏప్రిల్ 30 నుంచి 2022, డిసెంబర్ 3 మధ్య తయారు చేసిన స్కూటర్లు, మోటార్ సైకిళ్లలో ఈ లోపాన్ని గుర్తించినట్లు సుజుకీ ఇండియా పేర్కొంది.
హై టెన్షన్ కోర్డులో తలెత్తిన లోపం వల్ల ఇంజిన్ మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ వెల్లడించింది. అలాగే హై టెన్షన్ కోర్డ్ నీటిలో తడిచినట్లయితే స్కూటర్ స్పీడ్ సెన్సర్‌పై ప్రతికూల ప్రభావం పడి స్పీడ్ డిస్‌ప్లే ఆగిపోతుందని పేర్కొంది. ఈ రీకాల్ ప్రక్రియను ఇప్పటికే సుజు ఇండియా చేపట్టింది. ఆయా మోడళ్లు కొనుగోలు చేసిన వాహనదారులకు సమాచారం అందిస్తోంది. సమీపంలోని సుజుకీ మోటార్ సైకిల్స్ ఇండియా సర్వీస్ సెంటర్లో ఉచితంగా సమస్యను ఉన్న భాగాలను రీప్లేస్ చేసి ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.