కేంద్ర ప్రభుత్వం ఈనెల 23వ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విదేశాలకు వెళ్లేవారికి ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరంటూ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఆ అంశంపై స్పష్టత ఇచ్చింది. ట్యాక్స్ క్లియరెన్స్ పై కేంద్రం తీసుకొచ్చిన సవరణలు అందరికీ వర్తించబోవని తెలిపింది. ఆర్థిక అవకతవకలు పాల్పడిన వారు, పన్ను బకాయిలు ఉన్నవారు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందేందుకు పూర్తి చేయాల్సిన పనుల్లో బ్లాక్ మనీ యాక్ట్ 2015 కి వర్తించే నిబంధనలను సైతం చేర్చాలని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఫలితంగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకునే వారికి బ్లాక్ మనీ చట్టం 2015 కింద ఎలాంటి బకాయిలు పడి ఉండకూడదు. అయితే, ప్రతిపాదిత సవరణ ప్రకారం అందరూ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని తాజాగా ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 230 ప్రకారం.. ప్రతి వ్యక్తి ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు పేర్కొంది. 'నిర్దిష్ట వ్యక్తులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడి, ఐటీ చట్టం లేదా వెల్త్ ట్యాక్స్ చట్టం కింద నమోదైన కేసుల్లో పాత్ర ఉన్న వారు ఈ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రూ. 10 లక్షలు ఆ పైన పన్ను బకాయిలు ఉండడం, దానిపై స్టే లేని పక్షంలోనూ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.' అని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.
మరోవైపు.. సరైన కారణాలతో ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ల నుంచి అనుమతి పొందిన వారి నుంచి మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరతామని ఐటీ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, సంపద పన్ను చట్టం, గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్, వ్యయ పన్ను యాక్ట్ కింద బకాయిలు లేవని తెలియజేస్తూ ఐటీ విభాగం ఈ సర్టిఫికెట్ జారీ చేస్తుందని గుర్తు చేసింది. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.