దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్.. మెరుగైన త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్- జూన్) నికర లాభాన్ని భారీగా పెంచుకుంది. సమీక్షా త్రైమాసికంలో ఎయిర్‌టెల్ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రెండున్నర రెట్ల లాభం నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఎయిర్‌టెల్ లాభం రూ. 1612.5 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో లాభం రూ. 4160 కోట్లకు చేరింది. ఇక భారతీ ఎయిర్‌టెల్ కార్యకలాపాల ఆదాయం రూ. 37,440 కోట్ల నుంచి 2.8 శాతం ఎగబాకి.. రూ. 38,506.4 కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఎయిర్‌టెల్‌కు దేశీయంగా వచ్చే రాబడి 10.1 శాతం వృద్ధితో రూ. 29,046 కోట్లకు చేరింది. టెలికాం సంస్థలు ఆదాయాల్ని కొలవడం కీలకమైన.. ఒక వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పు- ARPU) రూ. 211 కు పెరగడం విశేషం. అంతకుముందు ఇదే సమయంలో రూ. 200 గా ఉంది. ఇటీవల టారిఫ్స్ పెంచగా.. ఈ ఆర్పు పెరిగిందని చెప్పొచ్చు. ఆర్పు విషయంలో ఇతర టెలికాం సంస్థల్ని మించి ఎయిర్‌టెల్ ముందువరుసలో ఉండటం విశేషం. 4G/5G కస్టమర్ల సంఖ్య కూడా క్యూ1లో 67 లక్షల మందికిపైగా పెరిగినట్లు ఫలితాల సమయంలో సంస్థ తెలిపింది. డేటా వినియోగం 26 శాతం పెరిగిందని.. దీంతో ఒక్కో కస్టమర్ సగటున నెలకు 23.7 GB డేటా వినియోగిస్తున్నట్లు వివరించింది.
ఇక సోమవారం రోజు భారత స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం భయాలు ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే ఫలితాల్లో ఎయిర్‌టెల్.. ఫలితాల్లో అంచనాల్ని మించుతుందని సంకేతాలు ఉన్నప్పటికీ.. స్టాక్ ధర పడిపోయింది. ఇతర చాలా సంస్థలతో పోలిస్తే ఎయిర్‌టెల్ షేరు పెద్దగా ప్రభావితం కాలేదు. సోమవారం సెషన్ ముగిసేసరికి ఎయిర్‌టెల్ షేరు 1.66 శాతం నష్టంతో రూ. 1469 వద్ద స్థిరపడింది. అంతకుముందు సెషన్లో రూ. 1493.80 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో దాదాపు 3 శాతం పతనంతో రూ. 1451.50 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్ విలువ రూ. 8.83 లక్షల కోట్లుగా ఉంది. ఎయిర్‌టెల్ స్టాక్.. 52 వారాల కనిష్ట విలువ రూ. 847.05 గా ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ముందుగా జియో.. టారిఫ్స్ పెంచగా.. తర్వాత వెంటనే ఎయిర్‌టెల్ కూడా రీఛార్జి ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 11 నుంచి 21 శాతం వరకు రేట్లు పెంచగా.. ప్రస్తుతం రీఛార్జి ధరలు దీంట్లోనే ఎక్కువగా ఉన్నాయి.