ఆదాయపు పన్ను రిటర్నులు ఈసారి రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. 7 కోట్ల మందికిపైగా తమ రిటర్నులు ఫైల్ చేశారు. ఇప్పుడు వారంతా తమ ట్యాక్స్ రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు. అయితే, ఇదే అదునుగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు రీఫండ్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ రీఫండ్ల పేరిట ట్యాక్స్ పేయర్ల ఫోన్లకు మోసేజ్‌లు పంపిస్తూ కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసి రీఫండ్ల కోసం ఎదుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని డబ్బులు దొచుకునేందుకు కుట్ర పన్ను తున్నారు. క్రమంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ కీలక ప్రకటన చేసింది. పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
' ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి అంటూ వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్ నమ్మవద్దు. ఫోన్లకు వచ్చే ఎలాంటి లింకులపైనా క్లిక్ చేయవద్దు. మీ రీఫండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అధికారిక ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ద్వారానే తెలియపరుస్తాం. ఫోన్లకు మెసేజ్‌లు, కాల్స్ ద్వారా ఎలాంటి సమాచారం ఉండదు. పిన్ నంబర్లు, పాస్‌వర్డులు, క్రెడిట్ కార్డు వంటి సమాచారాన్ని ఇ-మెయిల్ లేదా మెసేజ్‌ల రూపంలో ఐటీ శాఖ అడగదు. ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి' అని ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. నోయిడా సైబర్ పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ శాఖ పేరుతో వచ్చే లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దని సూచించారు.
ఐటీ రీఫండ్ ఖాతాలోకి రావాలంటే వ్యక్తిగత వివరాలు అందించాలని ఐటీ శాఖ పేరుతో మెసేజ్‌లు, మెయిల్స్ వచ్చినా, కొంత రుసుము చెల్లించాలంటూ సూచించానా అలాంటి వాటిని నమ్మవద్దని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. మీ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ గురించి తెలుసుకోవాలనుకుంటే అధికారిక ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా లేదా హెల్ప్ లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవాలని కోరింది. అలాగే సైబర్ నేరగాళ్ల మోసానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ సెల్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పేర్కొంది. కొందరు ఐటీ శాఖ అధికారులుగా నమ్మించి ఎమర్జెన్సీగా పేమెంట్లు చేయాలంటూ ఒత్తిడి చేస్తుంటారని, అలాంటి తక్షణ పేమెంట్ల కోసం ఐటీ శాఖ ఎప్పుడూ ఫోన్ చేయదని పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాలని సూచించింది.