టెలికాం సేవల్లో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి కేంద్రం ఇటీవలే కొత్త రూల్స్ తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిబంధనలపై పునరాలోచించాలన్న అంశంపై స్పంధించింది. కొత్త నిబంధనల అమలు విషయంలో తగ్గేది లేదని స్పష్టం చేసింది. విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేసి రూల్స్ తీసుకొచ్చామని పునరాలోచన చేసే అవకాశం లేదని తాజాగా టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లహోతి స్పష్టం చేశారు. టెలికాం సేవల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించనట్లయితే యూజర్లకు పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. అలాగే నిబంధనలు పాటించని కంపెనీలపై భారీగా పెనాల్టీలు ఉంటాయని గుర్తు చేశారు.
సిగ్నల్ రాకుంటే యూజర్లకు పరిహారం, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలకు ఫైన్ పెంచుతూ ఇటీవలే కొత్త రూల్స్ తెచ్చింది. అయితే ఈ రూల్స్ అమలు చేసేందుకు ఆరు నెలల గడువు ఇచ్చింది. కానీ, ఈ కొత్త రూల్స్ పై టెలికాం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని ట్రాయ్ చీఫ్ వెల్లడించడం గమనార్హం. వినియోగదారుడికి నాణ్యతతో కూడిన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే కొత్త నిబంధనలు తీసుకొచ్చామన్నారు ట్రాయ్ ఛైర్మన్. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కంపెనీలు సైతం తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ మేరకు బ్రాండ్ బ్యాండ్ ఇండియా ఫోరమ్ కార్యక్రమంలో మాట్లాడారు.
ట్రాయ్ కొత్త రూల్స్ ఇవే..
జిల్లా స్థాయిలో సిగ్నల్ రాకపోతే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అద్దెపై రిబేట్ ఇవ్వాలి. ప్రీపేయిడ్ యూజర్లకు కనెక్షన్ చెల్లుబాటు వ్యవధి పొడిగించాల్సి ఉంటుంది. సిగ్నల్ అంతరాయం 24 గంటలకు మించి ఉంటే సర్వీసు ప్రొవైడర్లు అద్దెలో కొంత రిబేట్ గా ఇవ్వాలి. పోస్ట్ పెయిడ్ యూజర్లకు వచ్చే బిల్ సైకిల్‌లో వాటిని చూపించాలి. 12 గంటల పాటు అంతరాయం ఉంటే అద్దేలో రిబేట్ లేదా వ్యాలిడిటీ కొనసాగింపునకు ఒక రోజుగా పరిగణించాలి. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలి. అయితే, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలా మినహాయింపు ఉంటుంది.
కొత్త రూల్స్ ప్రకారం సిగ్నల్ అంతరాయం ఏర్పడితే కంపెనీలకు పెనాల్టీ రూ. 50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచారు. నిబంధనల ఉల్లంఘనల గ్రేడ్స్ బట్టి లక్ష రూపాయలు, రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల వరకు పెనాల్టీ విధిస్తారు. ప్రాథమిక, సెల్యులార్ మొబైల్ సర్వీసెస్, బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్, బ్రాడ్ బ్యాండ్ వైర్ లెస్ సర్వీసులకు ఈ కొత్త రూల్స్ అమలు లోకి వస్తాయి.