భారత్‌లో ఇళ్లు, భూములు, ఆఫీస్ స్థలాలు ఏదైనా డిమాండ్ విపరీతంగా ఉంటుంది. కరోనా తర్వాత అంతకు ముందటి స్థాయితో పోలిస్తే గిరాకీ ఇంకా బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఇటీవల వస్తున్న గణాంకాలనే ఇందుకు సాక్ష్యంగా చెప్పొచ్చు. ఇప్పుడు మన దేశంలోని సిటీలు రియల్ ఎస్టేట్‌లో ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతున్నాయి. నైట్ ఫ్రాంక్ గ్లోబల్ రిపోర్టులో నివాస స్థలాల ధరల పెరుగుదలల్లో ముంబై నగరం ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలవగా.. ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఈ లిస్టులోనే బెంగళూరు కూడా స్థానం సంపాదించింది. ఇప్పుడు ఇదే క్రమంలో ముంబైలో రికార్డ్ స్థాయి డీల్ జరిగింది. ఇది ఆఫీస్ స్పేస్ లీజింగ్‌కు సంబంధించింది. అవును.. ప్రముఖ ఫండ్ మేనేజర్ అయిన బ్లాక్‌రాక్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముంబై వొర్లిలోని కార్యాలయ స్థలం లీజుకు తీసుకుంది.
మొత్తం 42,700 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అద్దెకు తీసుకుంది. ఇక ఇక్కడ నెలవారీ రెంట్ ఒక్కో చదరపు అడుగుకు రూ. 300 చొప్పున డీల్ కుదిరినట్లు డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్‌స్టాక్ డేటా చెబుతుంది. మొత్తం ఈ లీజింగ్ డీల్ ఐదేళ్ల కాలపరిమితికి గానూ కుదిరింది. 2024, ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి రానుండగా.. మొదటి 8 నెలలకు గానూ నెలవారీ రెంట్ రూ. 1.10 కోట్లుగా ఉంది. తర్వాతి 4 నెలలు ఇది రూ. 1.28 కోట్లుగా ఉంది. ఇక 2026 ఏప్రిల్‌లో ఈ అద్దె మరో 10 శాతం పెరుగుతుంది. 2027లో మరో 5 శాతం, 2028లో మరో 5 శాతం ఎక్కువ అద్దె చెల్లించేలా ఒప్పందం కుదిరింది.
ఇక ఈ ఆఫీస్ స్పేస్ ఆల్టిమస్ ఆఫీస్ టవర్‌లోని 13వ అంతస్తులో ఈ కార్యాలయ స్థలం ఉంది. ఇక ఈ టవర్లను రియాల్టీ డెవలపర్ కె. రహేజా కార్పొరేషన్ సబ్సిడరీ విష్‌పరింగ్ హైట్స్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మించింది. ఈ ట్రాన్సాక్షన్ లాకిన్ పీరియడ్ 36 నెలలుగా ఉంది. ఇక సెక్యూరిటీ డిపాజిట్ కింద కంపెనీ రూ. 12.8 కోట్లు చెల్లించింది.
దేశంలో జరిగిన అతిపెద్ద లీజింగ్ డీల్స్‌లో ఇదొకటిగా చెబుతున్నారు. 2024 జూన్‌లో చదరపు అడుగుకు రూ. 700 చెల్లించేలా ఒక ఒప్పందం జరిగింది. గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ ఐఎంసీ ట్రేడింగ్ సబ్సిడరీ ఐఎంసీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ .. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుంది.