దేశంలో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఇప్పుడు హైదరాబాద్ పోటీ ఇస్తుండటం విశేషం. కొన్ని సందర్భాల్లో వాటిని అధగమిస్తుంది కూడా. రికార్డు స్థాయిలో డీల్స్ జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఇళ్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రేట్లు కూడా ఏటా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచ స్థాయిలో చూస్తే మాత్రం హైదరాబాద్ ఇంకా ఆ స్థాయికి చేరలేదు. ఇప్పుడు 2024 రెండో త్రైమాసికానికి సంబంధించి నివాస ఆస్తుల (ఇళ్లు, నివాస స్థలాలు) ధరల పెరుగుదల గురించి గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఒక రిపోర్ట్ వెలువరించింది. ఇందులో దేశంలోని నగరాల్లో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరుకు స్థానం దక్కింది. ఈ త్రైమాసికంలో ప్రాపర్టీ రేట్లు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది.
వార్షిక ప్రాతిపదికన ధరల పెరుగుదల విషయానికి వస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం విశేషం. బలమైన డిమాండ్ నేపథ్యంలో హై ఎండ్, ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌కు ఊతంతో ఢిల్లీ, బెంగళూరు కూడా ఈ జాబితాలో నిలిచాయి. ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్, Q2, 2024 పేరిట ఈ రిపోర్ట్ విడుదల కాగా.. వార్షిక ప్రాతిపదికన చూస్తే ముంబైలో ఈ నివాస ఆస్తుల ధరల్లో 13 శాతం వృద్ధి కనిపించింది. అంతకుముందు 2023, Q2లో ఈ నగరం ఆరో స్థానంలో ఉంటే ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10.6 శాతం పెరుగుదలతో ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. ఇది అంతకుముందు సంవత్సరంలో 26వ స్థానంలో ఉండటం గమనార్హం. ఇక బెంగళూరులో ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు రెండో త్రైమాసికంలో 3.7 శాతం పెరిగింది. దీంతో ఇది తన 15వ స్థానాన్ని నిలబెట్టుకుంది.
భారత్ ప్రపంచంలోని అతిపెద్ద రెసిడెన్షియల్ మార్కె్ట్లలో ఒకటని.. ఇక్కడ నివాస ఆస్తుల ధరల్లో భారీ పెరుగుదల సంపద సృష్టిని, భారత ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తుందని రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల్లో ఈ సర్వే చేయగా.. వార్షిక ప్రాతిపదికన క్యూ1తో పోలిస్తే క్యూ2లో సగటున 4.1 శాతం నుంచి 2.6 శాతానికి వృద్ధి తగ్గినట్లు తెలిపింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా మొత్తంగా ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఇక్కడ 26 శాతం మేర ఆస్తుల ధరలు పెరిగాయి. ఇక 2020 నుంచి 124 శాతం పెరిగిన దుబాయ్‌లో మాత్రం ఇప్పుడు 0.3 శాతం తగ్గింది. మయామీలో 8 శాతం మేర వృద్ధి కనిపించింది. మాడ్రిడ్, దుబాయ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్ వంటి చోట్ల వృద్ధి నెమ్మదించింది.