పండగలు, ప్రత్యేక రోజులు వస్తున్నాయంటే చాలు ప్రముఖ ఇ- కామర్స్ సంస్థలు, హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ మొదలుకొని ఇతర చాలా కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలపై ప్రజలకు డిస్కౌంట్లు, ఇతర తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇది జనాన్ని ఆకర్షించేందుకు చేసే ఎత్తుగడగా చెప్పొచ్చు. ఏదేతైనేం ఆఫర్ వచ్చిందంటే జనం ఊరుకుంటారా. ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇటీవలి కాలంలో ప్రత్యేక రోజుల్లో ప్రముఖ విమాన సంస్థలు కూడా ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అంటే తక్కువ ధరల్లోనే విమాన ప్రయాణం చేసే అవకాశం ప్రజలకు కల్పిస్తున్నాయి. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో బస్ టికెట్ ధరలకే విమాన ప్రయాణం తీసుకొచ్చాయి.
ఇండిగో దేశీయ రూట్లలో కేవలం రూ. 1015 నుంచే ఫ్లైట్ టికెట్స్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఎయిరిండియా, విస్తారా కూడా వరుసగా రూ. 1947, రూ. 1578 లకే ఈ ఆఫర్ ప్రకటించాయి. పరిమిత కాలం పాటే ఈ ఆఫర్లు ఉంటాయి. ఆలోపు బుక్ చేసుకొని నిర్దిష్ట తేదీల్లోగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇది వన్ వే డొమెస్టిక్ ఆఫర్స్ అని గుర్తుంచుకోవాలి.
ఇక ఇప్పుడు మళ్లీ పండగ సీజన్ ప్రారంభం అవుతోంది. దీంతో విమానయాన సంస్థలు మళ్లీ చౌక టికెట్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్ కింద ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు రూ. 1037 నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఇంకా ఇది కాకుండా.. ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్స్ రూ. 1195 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్ట్ 25 వరకే ఈ ఆఫర్ ఉంది. అంటే ఆలోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆగస్ట్ 26 నుంచి అక్టోబర్ 24 వరకు ప్రయాణాలు చేసేందుకు వీలుంటుంది.
దేశంలో మొత్తం 32 గమ్యస్థానాలకు గానూ ఈ ప్రత్యేక ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా జీరో చెకిన్ బ్యాగేజీ ఫీజు ఉంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే మరో 3 కిలోల వరకు బ్యాగేజీపై ఆఫర్ ఉంది. కొత్త ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-8 విమానాల్లో ఈ ఎక్స్‌ప్రెస్ బిజ్ ఛార్జీలు ఉన్నాయి. బిజినెస్ క్లాస్ సౌకర్యాల్ని ఈ విమానాలు కలిగి ఉన్నాయి. ఇదే సమయంలో విద్యార్థులు, చిన్న వ్యాపార యజమానులు, సీనియర్ సిటిజెన్లు, డాక్టర్లు, నర్సులు, సైనిక సిబ్బంది వంటి వారు కూడా టికెట్లపై తగ్గింపు పొందొచ్చు. ఇంకా ఈ వెబ్‌సైట్లో గరిష్టంగా 8 శాతం వరకు న్యూకాయిన్స్ సంపాదించొచ్చు.