దేశీయ టెలికాం రంగంలో ఇటీవల కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకేసారి ఏకంగా 25 శాతం రీఛార్జ్ ధరలను పెంచి టెల్కోలు యూజర్లకు షాక్ ఇచ్చాయి.దీనికితోడు ప్రమోషనల్ కాల్స్, సర్వీస్ కాల్స్ అంటూ స్పాం కాల్స్ తో విసిగిస్తున్నాయి. దీనిపై ఓ ప్రత్యేక విధానాన్ని అనుసరించాలంటూ ట్రాయ్ కొత్త ప్రేమ వర్క్ ను రూపొందిస్తోంది. కానీ ఇదేమీ పట్టించుకోకుండా సదరు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక కస్టమర్లు భరిస్తూ వస్తున్నారు.
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ విసిగింపులను తట్టుకోలేని ఓ యూజర్ X వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ మరియు రచయిత అయిన నీలేశ్ మిశ్రా సోషల్ మీడియా లో ఎయిర్‌టెల్‌ను ట్యాగ్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నారు. 86 ఏళ్ల తన తండ్రికి ప్రతి రెండు,మూడు రోజులకు ఒకసారి కాల్స్ చేస్తూ విసిగిస్తున్నట్లు కంప్లైంట్ చేశారు. ఆయన దివంగత భార్య మొబైల్ కనెక్షన్ గురించి తరచుగా ఫోన్స్ వస్తూనే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు.
గత ఏడాది సెప్టెంబర్ లో తన తల్లి మరణించారని, అప్పుడే మొబైల్ కనెక్షన్ డిస్కనెక్ట్ కూడా చేసినట్లు మిశ్రా తెలిపారు. అయినప్పటికీ బిల్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎయిర్‌టెల్ నుంచి విపరీతంగా కాల్స్ వస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె మరణించారు అన్న వార్తను పదేపదే గుర్తు చేస్తూ తన తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మొదటగా మీ రికార్డులను అప్‌డేట్ చేసుకోవాలని ఎయిర్‌టెల్‌కు సూచించారు.
ఈ వ్యవహారంపై ఎయిర్‌టెల్ తిరిగి స్పందించింది. కలిగిన సౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్తూ, హృదయపూర్వక క్షమాపణలు తెలిపింది. తాము రికార్డులను అప్డేట్ చేశామని, మరోసారి తమ నుంచి కాల్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. యూజర్ల సమస్యల పరిష్కారానికి, కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు వివరించింది. దీంతో ఎయిర్‌టెల్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. భారత్‌లో కస్టమర్ కేర్ అనేది ఒక జోక్ అని, ఆ పేరితో వినియోగదారులను వేధిస్తున్నారని పోస్టులు పెడుతున్నారు.