కోవిడ్ తర్వాత టెక్, ఐటీ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. ఉద్యోగాల కోతల్లో టెక్ పరిశ్రమ అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఏదో ఒక సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగాల్లో ఆందోళన మొదలైంది. అయితే, దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ సంస్థలో కొత్త టెక్నాలజీ కారణంగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోవని స్పష్టం చేసింది. తమ క్లయింట్లలో చాలా వరకు జనరేటివ్ ఏఐ టెక్నాలజీపై ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. ఏఐ సాంకేతికతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, అయితే, ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఉద్యోగాల తొలగింపులు ఉంటాయని అనుకోవడం లేదని ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్.
ఒకప్పుడు డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు లభించినట్లుగానే ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఆదరణ లభిస్తోందన్నారు సీఈఓ సలీల్ పరేఖ్. కొత్త టెక్నాలజీ నుంచి ప్రయోజనాలు పొందే కొద్దీ వాటి అమలు వేగవంతమవుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ సంస్థలు తమ ఏఐ సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని, అదే తరహాలో ఇన్ఫోసిస్ సైతం తమ ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ క్లయింట్ల కోసం 225 జనరేటివ్ ఏఐ ప్రోగ్రామ్స్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ కొత్త టెక్నాలజీపై ఇప్పటికే 2.50 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇప్పిస్తున్న క్రమంలో ఉద్యోగాల కోతలు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. జనరేటివ్ ఏఐ అభివృద్ధి చెందడం వల్ల కొత్త రంగాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా కొత్త కొత్త అవకాశాలూ వస్తాయన్నారు. అలాగే తమ కంపెనీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన విధంగా నియామకాలు చేపడుతూ వెళ్తామని వెల్లడించారు.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మార్కెట్‌లో తమ స్థితిని బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు సీఈఓ సలీల్ పరేఖ్. ఈ ఏడాది రెండు కంపెనీలను కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. అదే తరహాలో ఇన్ఫోసిస్ ముందుగు కొనసాగుతుందన్నారు. కొత్త కొత్త విభాగాలతో పాటు కొత్త ప్రాంతాల్లోనూ వ్యాపార విస్తరణ చేపట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు చెప్పారు. డేటా అనలిటిక్స్, సాస్ వంటి రంగాల్లో అడుగుపెట్టనున్నట్లు తెలిపారు.