ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ అగ్రిగేటర్ పేటీఎంకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పేటీఎం షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. పేటీఎం సీఈఓ విజయ్ శంకర్ శర్మ, సంస్థ బోర్డు సభ్యులకు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులు పంపించిందన్న వార్తల నేపథ్యంలో షేర్లు కుప్పకూలాయి. బీఎస్ఈఓలో ఒక దశలో ఈ షేరు 9 శాతం మేర నష్టపోయి ఇంట్రాడే లోయర్ సర్క్యూట్ రూ.505.25ను తాకింది.
పేటీఎం ఐపీఓ వచ్చిన నవంబర్, 2021లో బోర్డు సభ్యులుగా ఉన్న వారితో పాటు సీఈఓకు సెబీ ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఐపీఓ సమయంలో వాస్తవాలను తప్పుగా చూపించి లాభపడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రమోటర్ క్లాసిఫికేషన్ నిబంధనలను పట్టించుకోలేదని సెబీ ఆరోపిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల చేపట్టిన దర్యాప్తులోని వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు సెబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూ సందర్భంగా పేటీఎం సీఈఓను ప్రమోటర్‌గా నిర్ణయించే అంశంపై వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం ప్రమోటర్లకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ వర్తించవు. అందుకే పేటీఎం సీఈఓకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ పొదేందుకు అర్హత లేదని తెలుస్తోంది.
ఈ విషయం బయటకు వచ్చిన క్రమంలో పేటీఎం షేరు ఒక్కసారిగా పడిపోయింది. ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో రూ.559.80 వద్ద ప్రారంభమైన పేటీఎం షేరు ఒక దశలో 8.8 శాతం మేర పడిపోయి రూ.505.55 వద్దకు దిగజారింది. అయితే మళ్లీ పుంజుకుని మార్కెట్లు ముగిసే నాటికి 4.48 శాతం నష్టంతో రూ.530 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ గత 5 రోజుల్లో 9 శాతం నష్టపోయింది. ఈఏడాది 2024లో చూస్తే 18 శాతం నష్టపోయింది. గత ఏడాది కాలంలో 40 శాతం నష్టాలు మిగిల్చింది.