మీరు మినీ ట్రక్కు, బస్సు లేదా ఇతర కమర్షియల్ వెహికల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ వాణిజ్య వాహనాల విక్రయలు నిర్వహించే వీఈ కమర్షియల్ వెహికల్స్ సంస్థ ఐచర్ ట్రక్స్ అండ్ బసెస్ గురువారం ఓ ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన వాహనాలపై భారీ తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. పాత వాహనాలను తుక్కు కింద మార్చిన తర్వాత, స్క్రాప్ సెంటర్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే కొత్త వాహనాలపై రాయితీ కల్పిస్తామని తెలిపింది. వాహనాన్ని బట్టి 1.25 శాతం నుంచి 3 శాతం వరకు ఈ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే కీలక ప్రకటన చేశారు. పాత వాహనాలను స్క్రాప్ పాలసీ కింద తుక్కు కింద మార్చి సర్టిఫికెట్ చూపిస్తే డిస్కౌంట్ ఇచ్చేందుకు వాహనాల తయారీ కంపెనీలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో కొత్త వాహనాలు కొనేవారికి భారీ డిస్కౌంట్ అందనుంది. అలాగే పాత వాహనాలతో ఏర్పడుతున్న కాల్యుష్యం తగ్గనుందనేది కేంద్రం వాదన. ఈ మేరకు వ్యక్తిగత, వాణిజ్య వాహనాల తయారీ కంపెనీలతో ఇటీవలే కేంద్రం చర్చలు జరిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన చేశారు.
గడ్కరీ ప్రకటన చేసిన రెండు మూడు రోజుల్లోనే దిగ్గజ వాహనాల తయారీ సంస్థ ఐచర్ ప్రకటన చేయడం గమనార్హం. తుక్కుగా మార్చిన వాహనం బేస్ రేటు, పేలోడ్ లేదా సీట్ల సామర్థ్యాన్ని బట్టి ఈ డిస్కౌంట్ ఉంటుందని ఐచర్ మోటార్స్ తెలిపింది. ఒక వేళ తుక్కుగా మార్చిన వెహికల్‌కి సరిపోయే సామర్థ్యం గల ట్రక్కు, బస్సు అందుబాటులో లేని సందర్భంలో దాని కంటే కొంచెం ఎక్కువ లేదా తక్కువ పేలోడ్ లేదా సీట్ల సామర్థ్యం గాల వాటిని ఎంచుకోవచ్చని వెల్లడించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం సెప్టెంబర్ 1, 2024 నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. అలాగే ఈ నిర్ణయం రెండేళ్ల పాటు లేదా తదుపరి ప్రకటన వచ్చే వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.