ఎవరి జీవితంలోనైనా కష్టనష్టాలు.. ఎత్తుపల్లాలు.. అనేవి సహజమే. ఎవరి జీవితమూ సాఫీగా సాగకపోవచ్చు. ఎన్నో బాధలు.. కష్టాలు.. అనుభవించాల్సి రావొచ్చు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కొన్నిసార్లు సంపాదించిన సొమ్మంతా కోల్పోవాల్సి రావొచ్చు కూడా. అయితే అలాంటి సమయంలో కూడా వెనకడుగు వేయకుండా గమ్యం చేరుకోవాలి. అచ్చం ఇలాంటి సంఘటనలన్నీ తన జీవితంలో ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ అనుపమ్ మిట్టల్. అద్భుత విజయాలు సాధించడం.. మళ్లీ తీవ్ర నష్టాల్లోకి జారుకోవడం.. తిరిగి మళ్లీ విజయం సాధించడం.. ఇలా తన ప్రయాణం గురించి లింక్డ్‌ఇన్ వేదికగా వివరించారు.
'కొద్దికాలంలోనే గొప్ప విజయాలు సాధించా. 20 ఏళ్లలోనే కోటీశ్వరుడిని అయిపోయా. మైక్రోస్ట్రాటజీలో నేను ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న సమయంలో కంపెనీ విలువ 40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో బాగానే డబ్బులు సంపాదించా. అమెరికాలో జీవితం కూడా చాలా అందంగా అనిపించింది. అప్పుడే ఫెరారీని కూడా ఆర్డర్ చేశా. అయితే అప్పటికే పరిస్థితి మారిపోయింది. డాట్-కామ్ బబుల్ సమయంలో అంతా కోల్పోయా. నా దగ్గర ఉన్న డబ్బంతా పోయింది. నిజం చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయా. 2003 నాటికి.. గెలుపోటముల జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. అక్కడితో నా కథ ముగియలేదు.' అని చెప్పారు మిట్టల్.
అంతా కోల్పోవడంతోనే బాగా ధైర్యం వచ్చిందని.. దీంతో మరో డాట్-కామ్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు మిట్టల్ వివరించారు. 'బాగా రిస్క్ చేసి షాదీ.కామ్ స్టార్ట్ చేశా. దీని డొమైన్ ధర 25 వేల డాలర్లు. మా వద్ద ఇక 30 వేల డాలర్లు మాత్రమే మిగిలింది. దీంతో అంతా నన్నో పిచ్చోడిలా చూశారు. నా బిజినెస్ గురించి ఎన్నో ప్రశ్నలేశారు. కానీ నేనవేమీ పట్టించుకోలేదు. ఇదో గేమ్ ఛేంజర్‌గా భావించి ముందడుగు వేశా. ఎంత మంది విమర్శించినా.. ధైర్యం కోల్పోకుండా.. క్లిష్ట పరిస్థితుల్లోనూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా. అలా పూర్వవైభవం పొందా.' అని మిట్టల్ అన్నారు.
ఈ ప్రయాణం కేవలం డబ్బు గురించి కాదని.. కేవలం ఒక్క గెలుపు, ఓటమితోనే ఎవరి సామర్థ్యాన్ని అంచనా వేయలేరని నిరూపించుకోవడమేనని చెప్పారు. విజయమనేది ప్రజాదరణ అభిప్రాయంతో ముందుకుసాగడం కాదని.. రిస్క్ తీసుకుంటున్న నిపుణులు, ఫౌండర్స్ మీపై నమ్మకం ఉంచుతూ.. ముందుకు సాగాలన్నారు. గెలిచేవరకు జీవితం అనే ఆట ఆడుతూనే ఉండాలని హితబోధ చెప్పారు.