తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 17న (ఆదివారం)న తిరుమలలో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. చిన్న గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి పరువేట మండపానికి చేరుకుంటారు. శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పార్వేట మండపానికి అమ్మవారు మరో పల్లకిపై ఊరేగింపుగా వస్తారు. గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో వనభోజన కార్యక్రమం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు. కార్తీక వనభోజనం నిర్వహించి అనంతరం సిబ్బందికి, భక్తులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు.
మరోవైపు తిరుమలలో ఇవాళ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉగ్రశ్రీనివాసమూర్తిని సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నవంబరు 15న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల గోగర్భం డ్యామ్ దగ్గర టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఆయుధపూజ ఘనంగా జరిగింది. టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు.