రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. వారి ఆకాంక్షల మేరకు పరిపాలన చేస్తాం. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిద్దాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం శాసనసభలో కూటమి పాలనపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ‘‘రాష్ట్రానికి ప్రజలే ఆస్తి. వారిని బలోపేతం చేస్తే ఏదైనా సాధ్యమే. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తా. ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తా. ఎన్నికల్లో ప్రజాతీర్పులు కొత్తకాదు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ వంటివి అప్పట్లో సంచలనం సృష్టించాయి. మొన్న జరిగిన ఎన్నికలు అంతకంటే సంచలనంగా మారాయి. 93 శాతం స్టైక్రేట్, 57 శాతం ఓట్ షేర్ వచ్చింది. 46 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రజాతీర్పు ఇంతకుముందు చూడలేదు. ప్రజలు బాధ్యతతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఓటేసి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును గౌరవిస్తూ, ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి. ప్రజల అంచనాలను అందుకునే బాధ్యత మనందరిపై ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.