పెద పాదం అంటే..
పెదపాదం అంటేనే వనయాత్ర అని పిలుస్తారు. ఎరుమేలి దగ్గర ప్రారంభమయ్యే యాత్ర.. సుమారు 58 కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు స్వామివారి సన్నిధి చేరుకుంటారు. అడవిగుండా సాగే పెదపాదం యాత్ర... రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది..ఎక్కడా రోడ్డు కనిపించదు. మధ్య మధ్యలో పక్షులు, జంతువులు, సెలయేర్లు, లోయలు కనిపిస్తాయి. ఈ దారి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళితే ఆ అనుభూతే వేరు. ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామిని ( అయ్యప్ప స్నేహితుడు..అనంతరకాలంలో భక్తుడు) ముందుగా దర్శించుకుని అక్కడ పేటతుళ్లై అనే నత్యం ఆడతారు. పేటతుళ్లై తర్వాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్భాణధారియై అయ్యప్పను దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి భక్తుల వనయాత్ర మొదలవుతుంది.
శబరిమల చేరుకునేందుకు వనయాత్ర అత్యంత కష్టంగా సాగుతుంది. అప్పటి రోజుల్లో శబరిమల చేరుకునేందుకు వనయాత్రనే అనుసరించేవారు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చినపాదం యాత్రను ప్రారంభించింది దేవస్థానం. అనంతరం కేరళ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించింది. ఈ ప్రాంతం మొత్తం ఎన్నో వన మూలికలు ఉంటాయి. నడక మార్గంలో ఆ మూలికల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఒక్కసారైనా వనయాత్ర చేయాలంటారు. పెదపాదం మార్గంలో భాగంగా అళుదా నదినుంచి రెండు రాళ్లు తీసుకుని..ఆ రాళ్లను కళిద ముకుండ అనే ప్రదేశంలో వేస్తారు. ఈ మార్గంలో అన్నిటికన్నా కష్టమైన శిఖరాలంటే కరిమల, నీలిమల. అత్యంత కష్టమైన ఈ మార్గాన్ని దాటేందుకు స్వయంగా స్వామివారు సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం. శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారీ పెదపాదం మార్గం ఓపెన్ చేయరు. కేవలం మకరవిళక్కు సమయంలో ఓపెన్ చేసి...తిరిగి సంక్రాంతి తర్వాత జనవరి 20న పెదపాదం మార్గం మూసివేస్తారు.
చిన్న పాదం అంటే..
పెదపాదం మార్గంలో శబరిమల చేరుకోలేని వాళ్ళు చిన్న పాదాన్ని ఆశ్రయిస్తారు. పంబా దగ్గరున్న కన్నెమూల గణపతికి టెంకాయ సమర్పించి యాత్ర మొదలుపెడతారు. మొదటిసారి మాల వేసుకున్నవారు తీసుకొచ్చిన బాణాన్ని శరమ్ గుత్తి దగ్గర విడిచిపెడతారు. ఇక్కడ నుంచి సన్నిధానానికి చేరుకోవడం అత్యంత సులభం. కేవలం మూడున్నర నుంచి 4 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇరుముడి పట్టుకునే భక్తులకు మాత్రమే 18 మెట్లు ఎక్కే అవకాశం ఉంటుంది.