వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దాయాది దేశానికి తమ జట్టును పంపించేది లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. దాంతో భారత్ లేకుండా టోర్నీ నిర్వహించడం కష్టం కనుక ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను పీసీబీ ముందు ఉంచింది. అయితే, ఈ విషయంలో పాక్ తన వైఖరిని స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇక టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 తేదీల మధ్య జరిగే అవకాశం ఉంది. దీంతో ఇంకో 75 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ కోసం ఇప్పటికే భారీగా డబ్బు వెచ్చించిన బ్రాడ్కాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ త్వరగా ఖరారు చేయాలని ఐసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక షెడ్యూల్ ప్రకటన మరింత ఆలస్యమైతే టోర్నీలో భారీ మార్పు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. టోర్నీని ముందు అనుకున్నట్లు 50 ఓవర్ల ఫార్మాట్లో కాకుండా టీ20 ఫార్మాట్లో నిర్వహించే అవకాశం ఉందట. వన్డే ఫార్మాట్లో కాకుండా టీ20 ఫార్మాట్లో అయితే నష్టం వాటిల్లకుండా ఉంటుందని ప్రసారకర్తలు, కొంతమంది వాటాదారులు ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారని సమాచారం. "టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఇలాగే కొనసాగితే టీ20 ఫార్మాట్లో మార్చాలని కొంతమంది వాటాదారులు కోరే అవకాశం ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్‌కు రానురాను ఆదరణ తగ్గిపోతుండటంతో టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్లోకి మార్చితే వేగంగా, సులభంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు" అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఐసీసీ కూడా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.