మీరు గత ఆర్థిక సంవత్సరం 2023-24 లేదా 2021- 2022కి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేశారా? లేదా పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తుంటారా? అయితే ఇది మీకోసమే. వార్షిక సమాచార నివేదిక లోని సమాచారం, మీరు ఐటీఆర్‌లో చూపించిన ఆదాయంతో సరిపోలనట్లయితే మీకు ట్యాక్స్ నోటీసులు వస్తాయి చూసుకోండి. ఇలా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లోని ఆదాయానికి, మీరు ఐటీ రిటర్నుల్లో చూపించిన ఆదాయానికి తేడాలు ఉన్నట్లయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ) ప్రత్యేక ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏదైనా తేడా గుర్తించినట్లయితే నోటీసులు పంపుతోంది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ 17, 2024 మంగళవారం రోజున పత్రికా ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం.. ' వార్షిక సమాచార నివేదికలో రికార్డ్ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేదా హై వాల్యూ ట్రాన్సాక్షన్లు ఐటీఆర్‌లో చూపించని వారే ఈ స్పెషల్ క్యాంపెయిన్ టార్గెట్. ఇ-వెరిఫికేషన్ స్కీమ్ 2021లో భాగంగా ఎలక్ట్రానికి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. తేడాలు గుర్తించిన వారికి ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తున్నాం. ఆదాయ వ్యత్యాసాలు ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
మీకూ నోటీసులు వస్తే ఏం చేయాలి?
కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన ప్రత్యేక ఇ-వెరిఫికేషన్ క్యాంపెయిన్‌లో భాగంగా మీకూ నోటీసులు వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రత్యేక కంపెయిన్ ద్వారా మీకు ఇ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందినట్లియితే మీరు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన అప్డేటెడ్ ఐటీఆర్ లేదా లేట్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏఐఎస్, ఐటీఆర్‌లోని ఆదాయాల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలి. బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు డిసెంబర్ 31, 2024 వరకే అవకాశం ఉంటుందని ట్యాక్స్ పేయర్లు గుర్తుంచుకోవాలి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు మార్చి 31, 2025 వరకు అవకాశం ఉంటుంది.