దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌లో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదానీ గ్రూప్‌కే చెందిన లిస్టెడ్ కంపెనీల్లో ఒకటైన అంబుజా సిమెంట్స్ మంగళవారం రోజు కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ సహా సౌరాష్ట్ర కేంద్రంగా ఉన్న సంఘీ ఇండస్ట్రీస్‌ను తనలో విలీనం చేసుకోనున్నట్లు వెల్లడించింది. దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్.. దీనికి సంబంధించి మంగళవారం రోజు రెండు వేర్వేరు విలీన ప్రణాళికల్ని ప్రటించింది. ఈ విలీనాలతో.. వ్యవస్థాగత పనితీరు మరింత మెరుగవుతుందని.. నియంత్రణపర అవసరాలు సరళతరం అవుతాయని అంబుజా సిమెంట్స్ పేర్కొంది.
పెన్నా, సంఘీ ఇండస్ట్రీస్‌తో విలీన ప్రణాళికలకు.. అంబుజా సిమెంట్స్ బోర్డు మంగళవారం రోజే ఆమోదం తెలిపింది. ఇక ఈ విలీనానికి పూర్తి స్థాయిలో నియంత్రణపరమైన అనుమతులు లభించాల్సి ఉంది. రానున్న 9-12 నెలల్లో ఈ ట్రాన్సాక్షన్ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది. సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉండగా.. మరోవైపు పెన్నా సిమెంట్ మాత్రం అన్‌లిస్టెడ్ కంపెనీ. ఇప్పుడు అంబుజా సిమెంట్స్‌లో విలీనంతో సంఘీ షేర్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. సంఘీలో అంబుజా కంపెనీకి 58.08 శాతం పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది. రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతి 100 సంఘీ ఇండస్ట్రీస్ షేర్లకు.. రూ. 2 ముఖ విలువ ఉన్న 12 ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది.
విలీన ప్రకటన నేపథ్యంలో సంఘీ ఇండస్ట్రీస్ షేరు ధర భారీగా పడిపోయింది. ఈ వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం 2.50 గంటల టైంలో స్టాక్ 11 శాతానికిపైగా నష్టంతో రూ. 68.29 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 12 శాతానికిపైగా పతనంతో రూ. 67.01 వద్ద సెషన్ కనిష్టం, 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 156 గా ఉండగా.. మార్కెట్ విలువ రూ. 1.76 వేల కోట్లుగా ఉంది. ఇక అంబుజా సిమెంట్స్ స్టాక్ ధర ఒక శాతానికిపైగా తగ్గింది.
ఇదే విధంగా.. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌కు కూడా వర్తిస్తుంది. రికార్డ్ తేదీకి రూ. 10 ముఖ విలువ ఉన్న ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 321.50 చొప్పున చెల్లించనున్నట్లు అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. 2024 ఆగస్ట్ 16న.. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను అంబుజా సిమెంట్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ ఏకంగా రూ. 10,422 కోట్లుగా ఉన్నట్లు తెలిసింది. పెన్నా కంపెనీ.. హైదరాబాద్‌లోనే రిజిస్టర్ అయి ఉంది. ఇక దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ వంటి చోట్ల తయారీ యూనిట్లు ఉన్నాయి.