సంపాదించిన దాంట్లో కొంత పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే, అందులో మనకు ఏది సరైనదో నిర్ణయించుకోవడంలోనే అసలు విషయం దాగి ఉంటుంది. రిస్క్ తీసుకునే సామర్థ్యం, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడి పెట్టాలి. చాలా మంది రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లు రిస్క్ లేని పెట్టుబడి మార్గాల గురించి అన్వేషిస్తారు. అలాంటి వారికి పోస్టాఫీసు అందిస్తోన్న టర్మ్ డిపాజిటు సరైన ఎంపికగా చెప్పవచ్చు.
పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లుగానే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్టాఫీసు ఈ పథకాన్ని అందిస్తుంది. పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు 1, 3, 5 ఏళ్ల టెన్యూర్ కలిగి ఉంటాయి. ప్రస్తుతం పోస్టాఫీసు 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా చాలా పెద్ద బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తోంది. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు 7.50 శాతంగా వస్తోంది. 5 సంవత్సరాల మెచ్యూరిటీ టెన్యూర్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే మళ్లీ పొడిగించుకోవచ్చు. దీంతో మీకు వడ్డీపైన వడ్డీ జనరేట్ అవుతుంటుంది.
రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు
మీరు పోస్టాఫీసులో టైమ్ డిపాజిట్ 5 సంవత్సరాల టెన్యూర్ ఎంచుకుని అందులో రూ.5 లక్షలు జమ చేశారు అనుకుందాం. 5 సంవత్సరాల పాటు ఏడాదికి 7.5 శాతం చొప్పున వడ్డీ మొత్తం రూ. 2,24,974 అందుతుంది. అంటే మొత్తంగా మీ చేతికి రూ. 7,24,974 వస్తాయి. మీరు దీనిని విత్ డ్రా చేయకుండా మరో 5 సంవత్సరాలు పొడిగించారు అనుకుందాం. అప్పుడు మీకు 10 సంవత్సరాల తర్వాత మొత్తం వడ్డీ రూ. 5,51,175 వరకు లభిస్తుంది. అంటే మీ చేతికి మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 10,51,175 అందుతాయి.
అయితే పోస్టాఫీసు అందిస్తున్న 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల టెన్యూర్ టైమ్ డిపాజిట్ పథకాలను పొడిగించుకోవాలనుకుంటే మెచ్యూరిటీకి 18 నెలలలోపుగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఖాతా ఓపెన్ చేసే టప్పుడే మెచ్యూరిటీ తర్వాత పొడిగించుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థించవచ్చు. మెచ్యూరిటీ రోజు సంబంధిత టీడీ ఖాతాపై వర్తించే వడ్డీ రేటు పొడిగించిన వ్యవధిలోనూ వర్తిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంటుంది. కొన్నిసార్లు పెంచడం, తగ్గించడం చేస్తుంది. కొన్నిసార్లు యథాతథంగానూ కొనసాగిస్తుంది.