నెయ్యిని చాలా మంది ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నం, పచ్చడి కలుపుకుని కాస్తా నెయ్యి కలుపుకుని తింటే స్వర్గమే. అంతేకాకుండా వంటల్లో మంచి ఫ్లేవర్, టేస్ట్ రావడానికి నెయ్యి వాడుతుంటారు. అంతేకాకుండా నెయ్యితో చేసిన స్వీట్స్ మంచి టేస్ట్ ఇస్తాయి. ఇక, చిన్న పిల్లలకు నెయ్యిని తినిపిస్తుంటారు పెద్దలు. నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నెయ్యిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ,డి, ఇ,కె, ఒమేగా -3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అలాంటి నెయ్యిలో డ్రై ఫ్రూట్ అయిన ఎండుద్రాక్షను వేయించి తింటే బోలెడు లాభాలు ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఎండుద్రాక్షతో ప్రయోజనాలు..
ఎండు ద్రాక్ష తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కిస్‌మిస్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గతుంది. దీనిని రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయ పనితీరు మెరగవుతుంది. రోజూ ఎండు ద్రాక్ష తినడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ఎముకల ఆరోగ్యానికి ఎండు ద్రాక్ష చాలా మంచిది. అలసట, నీరసంతో బాధపడేవారికి తక్షణ శక్తిని ఇస్తుంది ఎండు ద్రాక్ష. మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు వీటిని తినడం వల్ల మేలు జరుగుతుంది. అదే ఎండుద్రాక్షను నెయ్యిలో వేయించి తింటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి.
రక్తహీనత సమస్యకు చెక్..
ఎండుద్రాక్ష తినడం వల్ల శారీరక బలహీనత తొలగిపోతుంది. రక్తహీనత లేదా బలహీనతతో బాధపడుతున్న వారికి ఎండుద్రాక్ష బెస్ట్ ఆప్షన్. ఎండుద్రాక్షలో వివిధ సూక్ష్మపోషకాలు, ఐరన్, విటమిన్లు, ఇతర పోషకాలు మెండుగా ఉన్నాయి. అదే నెయ్యిలో వేయించి తినడం వల్ల రెండింటి ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన కిస్‌మిస్ తినడం వల్ల శరీరానికి పోషకాహారం లభిస్తుంది. ఇది శారీరక అలసటను తగ్గిస్తుంది, బలహీనతను తొలగిస్తుంది. అంతేకాకుండా బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎముకల బలహీనత దూరం..
ఎండుద్రాక్షలో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఎముకలు, దంతాల బలానికి అవసరమైన పోషకం. నెయ్యిలో వేయించి ఎండుద్రాక్ష తినడం వల్ల కాల్షియం ప్రయోజనాలు డబుల్ అవుతాయి. అంతేకాకుండా ఈ రెండింటి కాంబినేషన్‌లో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. దీంతో.. శరీరం, ఎముకలు లోపలి నుంచి బలపేతం అవుతాయి. కిస్మిస్‌ను నెయ్యిలో వేయించి తింటే ఎముకల బలహీనత తొలగి.. అవి దృఢంగా మారతాయి.
మలబద్ధకం నుంచి రిలీఫ్..
చలికాలంలో మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ఇది చాలా మందికి ఇబ్బంది. అయితే, నెయ్యిలో వేయించిన ఎండుద్రాక్ష తినడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల ప్రేగు కదిలికలు వేగవంతం అవుతాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గర్బిణీ స్త్రీలకు లాభాలు..
ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో రక్తహీనతను నివారించడంలో ఎండుద్రాక్ష తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. అదే నెయ్యిలో వేయించిన ఎండుద్రాక్ష తినడం వల్ల ఈ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
నెయ్యిలో ఎలా వేయించాలి?
ముందుగా ఒక పాన్ తీసుకోండి. అందులో ఒక చెంచా నెయ్యి వేయండి. నెయ్యి వేడి అయ్యాక అందులో పది నుంచి 12 ఎండుద్రాక్ష వేసి వేయించాలి. చల్లారిన తర్వాత వీటిని అలాగే తినవచ్చు. లేదంటే ఈ నెయ్యిలో వేయించిన ఎండుద్రాక్షను పాలతో కలిపి తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్‌ను ఉదయం అల్పహారంగా లేదా రాత్రి నిద్రపోయే ముందు పాలతో వేయించిన ఎండుద్రాక్షను తినవచ్చు.