నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవదాయశాఖ సరి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలను అనుసరించి శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమతచిహ్నాలు ప్రదర్శించడం పూర్తిగా నిషేధం విధించారు.ఈ విషయాన్ని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలం ఈఓ మాట్లాడుతూ అన్యమత సూక్తులను, చిహ్నాలను, భోదనలను, అన్యమతానికి సంబంధించిన ఫోటోలు కలిగిఉన్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతించబడవని పేర్కొన్నారు.శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రచారాలకు, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే అని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన విరుద్దంగా ప్రవర్తించిన వారిపై చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకొనబడతాయని ఈఓ హెచ్చరించారు.