దేశంలో నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్ర పోవడం వల్లే ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ కూరగాయల మార్కెట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ.. అక్కడి వ్యాపారులతో పాటు సామాన్య ప్రజలతో మాట్లాడారు. ధరల పెరుగుదలతో ప్రజల జీవితాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో తెలుకున్నారు. అలాగే ఎక్స్ వేదికగా అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి మరీ షాకింగ్ కామెంట్లు చేశారు.
కొన్ని రోజుల క్రితమే రాహుల్ గాంధీ.. ఢిల్లీలోని గిరినగర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడి సామాన్య ప్రజలతో కలిసి మాట్లాడారు. వాళ్లు కూరగాయుల కొనుగోలు చేస్తుండగా చూస్తూ మరీ ధరలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల ధరలు చెప్పగానే మహిళలు ఇచ్చిన రియాక్షన్ చూసి.. వారి మనసులోని భావాలను అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు చిన్న చిన్న విషయాలకు కూడా రాజీ పడాల్సి వస్తుందని వివరించారు. గతంలో రూ.40 ఉండే కిలో వెల్లుల్లి ధర ప్రస్తుతం 400లకు చేరిందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే వెల్లుల్లి కంటే బంగారమే చౌక అంటూ కామెంట్లు చేశారు.
ఇలా నిత్యావసర సరుకుల ధరలు అంతకంతకూ పెరిగిపోతూ ఉంటే ప్రజలు ఇంక పొదుపు ఏం చేయగల్గుతారని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా మహిళలు కూరగాయల ధరలు పెరగడంతో.. 10 రూపాయల ఛార్జీ పెట్టి రిక్షా కూడా ఎక్కకుండా వాటితో ఏమైనా కొనుక్కోవాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్యుడి వంట గది బడ్జెట్ వారి చేయి దాటి పోయిందని వివరించారు. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్రం.. కుంభకర్ణుడిలా నిద్ర పోతుందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలన్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు దించి.. వారికి మేలు చేయాలన్నారు.
మరోవైపు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇంఛార్జీ జైరాం రమేష్.. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను ఎత్తి చూపుతూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. గత ఏడాది కాలంలోనే పిండి, నూనె, మసాలాలు, డ్రై ఫ్రూట్స్ ధరలు 50 నుంచి 100 శాతం వరకు పెరిగాయని వివరించారు. ఈక్రమంలోనే ప్రధాని మోదీ ప్రకటించిన బుల్లెట్ రైలు రాలేదు కానీ.. బుల్లెట్ రైలు వేగం కంటే వేగంగా దూసుకుపోతున్న ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల నడ్డి విరిచిందని ఎద్దేవా చేశారు. ఇకనైనా సర్కారు ప్రజల సమస్యలను అర్థం చేసుకుని ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు.