బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో అత్యధికంగా 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టాప్ వికెట్ టేకర్‌గా నిలిచినప్పటికీ మొత్తం 28.4 ఓవర్లు వేసి 3.50 ఎకానమీతో మొత్తం 99 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బుమ్రా పేరిట ఒక అవాంఛిత రికార్డు నమోదయింది.ఒక టెస్ట్ మ్యాచ్ సింగిల్ ఇన్నింగ్స్‌లో బుమ్రా 99 పరుగులు సమర్పించుకోవడం కెరీర్‌లో ఇదే తొలిసారి. అంతకముందు 2020లో వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 88 పరుగులు ఇచ్చాడు. మెల్‌బోర్న్ టెస్టులో మరో 11 పరుగులు ఎక్కువగా సమర్పించుకోవడంతో గత రికార్డు బద్దలైంది. ఇక మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్ వరకు టెస్ట్ కెరీర్ మొత్తం మీద 7 సిక్సర్లు మాత్రమే సమర్పించుకున్న జస్ప్రీత్ బుమ్రా... ఈ ఒక్క మ్యాచ్‌లోనే నాలుగు సిక్సర్లు బాదించుకోవడం విశేషం. గణాంకాల పరంగా బుమ్రాకు చెత్త ప్రదర్శనే అయినప్పటికీ, ఈ మ్యాచ్ లో భారత బౌలర్లలో తాను అత్యుత్తమం కావడం గమనార్హం. కాగా, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్న విషయం తెలిసిందే