బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం చేసాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలే తడబడిన పిచ్ పై క్రికెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేసే ఇన్నింగ్ ఆడాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా బౌలర్లకు ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ టెస్ట్ క్రికెట్ లో తొలి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కేవలం171 బంతుల్లో 100 పరుగులు బాదిన నితీష్ రెడ్డి ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474పరుగులు చేసింది. అయితే రెండోరోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 82 పరుగులు మినహా మిగతా ఎవ్వరూ రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే కేవలం 3 పరుగులు మాత్రమే చేసాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 165 పరుగులు మాత్రమే... అప్పటికే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది.
ఓవర్ నైట్ స్కొరు 165 వద్ద ఇవాళ(మూడోరోజు) ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రిషబ్ పంత్ కేవలం 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. దీంతో ఇక మిగతా వికెట్లు టపటపా పడతాయని... కనీసం ఇంకో వంద పరుగులైన జోడిస్తారా అన్న అనుమానం కలిగింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.
వికెట్లు టపటపా పడుతున్నాయి... ఇదే కొనసాగితే టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సి వుంటుంది. పరిస్థితి ఏమంత బాగాలేదు. అప్పటికే ప్రధాన బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు చేరారు. ఇలా టీమిండియా కష్టకాలంలో వుండగా నితీష్ ఆశాకిరణంలా మెరిసాడు. మొదట మెళ్లిగా ఆడుతూ వికెట్ పడకుండా చూసుకున్నాడు... పిచ్ ఎలా వుందో అర్థం చేసుకున్నాడు... ఆ తర్వాత బ్యాట్ ను ఝళిపించడం షురూ చేసాడు.
ప్రత్యర్థి బౌర్లను దీటుగా ఎదుర్కొంటూ ఒక్కో పరుగును జోడించాడు...వీలు చిక్కినప్పుడు చక్కటి బౌండరీలు బాదాడు. తనదైన బ్యాటింగ్ తో రెచ్చిపోయిన నితీష్ టెస్ట్ కెరీర్ లో మొదటి సెంచరీ సాధించాడు. ఇలా వ్యక్తిగత రికార్డును సాధించడమే కాదు టీమిండియాను ఫాలో ఆన్ గండం నుండి బైటపడేసాడు. నితీష్ బ్యాటింగ్ ను చూసి అభిమానులే కాదు టీమిండియా క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయాడు. ఇంత పరిణతితో అతడు ఆడిన తీరు చూసి గవాస్కర్ లాంటివారు ఫిదా అయిపోయారు.
నితీష్ కుమార్ రెడ్డికి వాషింగ్టన్ సుందర్ నుండి మంచి సహకారం లభించింది. అతడు కూడా హాఫ్ సెంచరీతో మెరిసాడు. వీళ్లద్దరు కలిసి సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమిండియా మంచి స్కోరు సాధించి ఆస్ట్రేలియాకు సవాల్ విసిరే స్థాయిలో నిలిచింది. నితీష్ కుమార్ రెడ్డి గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఈ తెలుగు కుర్రాడు ఒకే ఒక్క సుడిగాలి ఇన్నింగ్స్ తో తన జాతకాన్నే మార్చుకున్నాడు. ఇలా ఐపిఎల్ లో అదరగొట్టిన నితీష్ తన కలను నిజం చేసుకున్నాడు... టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఆడే అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే గత మూడు మ్యాచుల్లో అద్భుతంగా ఆడినా ప్రతిసారీ హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. కానీ ఈసారి అలా కాదు... అద్భుతంగా ఆడి సెంచరీ బాదాడు.
ఇలా విదేశీ గడ్డపై సత్తాచాటి తన కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు నితీష్. దీంతో ఒక్కసారిగా తెలుగు ఆల్ రౌండర్ పేరు మారుమోగిపోతోంది. ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మన తెలుగు యువకెరటం నితీష్ వ్యక్తిగత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం. చిన్నప్పటి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న అతడికి కుటుంబ ప్రోత్సాహం కూడా లభించింది. దీంతో విశాఖ గల్లీల్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న అతడు ఇప్పుడు విదేశీ గడ్డపై సెంచరీ మోత మోగించాడు.
నితీష్ విశాఖలో నివసించే సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి ముత్యాల రెడ్డి విశాఖలోని హిందుస్థాన్ జింక్ లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి గృహిణి. అయితే కొడుకు క్రికెట్ ను ఇష్టపడటంతో ఆ తల్లిదండ్రులు ఆ దిశగానే నితీష్ ను తీర్చిదిద్దారు. చదువు పాడయిపోతుందని, క్రికెట్ లో లైఫ్ లేదని అందరి తల్లిదండ్రులు నిరుత్సాహపర్చకుండా కొడుకు క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకునేలా చూసారు. కొడుకు కెరీర్ కోసం ముత్యాలరెడ్డి తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు.
ఇలా చాలా చిన్నప్పుడే బ్యాట్ చేతబట్టిన నితీష్ అంచెలంచెలుగా ఎదిగాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాటుదేలిన నితీష్ టీమిండియా మాజీ ప్లేయర్ ఎమ్మెస్కే ప్రసాద్ కంటపడ్డాడు. అతడి టాలెంట్ ను గుర్తించిన ఎమ్మెస్కే కడపలోని ఏసిఏ అకాడమీలో చేరేందుకు సహకరించాడు. అక్కడే నితీష్ పరిపూర్ణమైన క్రికెటర్ గా మారాడు.
ఐపిఎల్ నుండి ఆస్ట్రేలియా సెంచరీ వరకు :
దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా తరఫున ఆడే అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి దక్కింది. ఆల్ రౌండర్ గా సత్తాచాటిన అతడు ఇండియ అండర్ 19 బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇతడు 566 పరుగులు చేశాడు. ఆంధ్ర తరుపున రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడి 366 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ కొట్టాడు.
చక్కటి బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో సన్ రైజర్స్ టీం మేనేజ్ మెంట్ దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది హైదరాబాద్ టీం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు అద్భుత ఇన్పింగ్స్ తో స్టార్ గా మారాడు. ఐపిఎల్ లో అద్భుత ప్రదర్శన ద్వారా టిమిండియా అవకాశం అతడి తలుపుతట్టింది. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు నితీష్.
ఇప్పుడు టీమిండియా తరపున విదేశీ గడ్డపైన అదీ బోర్డర్ గవాస్కర్ ట్రోపి వంటి ప్రతిష్టాత్మక టెస్ట్ సీరిస్ లో అద్భుతంగా ఆడుతున్నాడు నితీష్. గత మూడు టెస్టుల్లో 41,38(నాటౌట్),42,42,16 స్కోరు సాధించాడు. ఇలా మూడునాలుగు సార్లు హాప్ సెంచరీ మిస్సయిన నితీష్ ఈసారి టార్గెట్ మిస్సవలేదు. టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీ బాది మరోసారి తానేంటో నిరూపించుకున్నారు.
నితీష్ కుమార్ రెడ్డి "తగ్గేదేలే" pic.twitter.com/cCApW5CULo
— సాయ (@sAAi_x) December 28, 2024