మెల్ బోర్న్ లో ఆస్టేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మేటి బ్యాట్స్ మెన్ రోహిత్, కొహ్లీ, కేఎల్ రాహుల్ విఫలమైన చోటే సెంచరీతో చెలరేగడం ద్వారా జట్టులో తాను ఎంత విలువైన క్రికెటరో మరోసారి నిరూపించాడు. అంతే కాదు ఆస్ట్రేలియాపై టెస్టుల్లో సెంచరీ చేసిన మూడో అత్యంత పిన్న వయస్కుడైన భారత బ్యాటర్ గానూ నితీష్ రెడ్డి నిలిచాడు. అదే సమయంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కు భారీ షాకిచ్చాడు.
ఈ మ్యాచ్ కు ముందు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై కామెంటేటర్ గా ఉన్న సంజయ్ మంజ్రేకర్ చీప్ కామెంట్స్ చేశాడు. అసలు నితీష్ బ్యాటింగ్ ఆల్ రౌండరా, బౌలింగ్ ఆల్ రౌండరా అంటూ హేళనగా వ్యాఖ్యలు చేశాడు. అతన్ని ఈ మ్యాచ్ లో తీసుకోకపోవడమే మంచిదంటూ టీమ్ మేనేజ్ మెంట్ కు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. నితీష్ ను తప్పిస్తే జడేజాకు మేలు జరుగుతుందంటూ కొత్త లాజిక్ ను తెరపైకి తెచ్చాడు. అయితే మ్యాచ్ లో నితీష్ రావడం మంజ్రేకర్ కోసమే అన్నట్లుగా సెంచరీ బాది నాటౌట్ గా నిలవడం వరుసగా జరిగిపోయాయి.
మ్యాచ్ కు ముందు నితీష్ రెడ్డి ఎనిమిదో స్ధానంలో వచ్చి 120 పరుగులు కొట్టలేడు, ఏడు వికెట్లూ తీయలేడంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్ మంజ్రేకర్ కు ఇవాళ అతని ఇన్నింగ్స్ భారీ షాకిచ్చింది. సంజయ్ మంజ్రేకర్ కు చెంపపెట్టులాంటి ఇన్నింగ్స్ ఆడాదంటూ నితీష్ రెడ్డిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దంటూ సంజయ్ మంజ్రేకర్ ను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.