మెల్‌బోర్న్ టెస్టులో మరో వివాదం రేగింది. రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ (84) ఔటైన తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్లు విఫలమైనప్పటికీ.. యశస్వి మాత్రం తొలినుంచీ నిలకడగా ఆడాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (70.5వ ఓవర్) లెగ్‌సైడ్ బంతిని విసిరాడు. దానిని ఆడేందుకు యశస్వి ప్రయత్నించాడు. అది మిస్ కావడంతో నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది. ఆసీస్ అప్పీలు చేసినా.. ఫీల్డ్ అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వలేదు. దీంతో వెంటనే కమిన్స్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. సమీక్షించిన థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. సాధారణంగా బ్యాట్‌ను బంతి తాకిందా? లేదా? అనేది స్నికో మీటర్‌లో వచ్చే స్పైక్‌ను బట్టి నిర్ణయిస్తారు. కానీ, యశస్వి ఔట్ విషయంలో మాత్రం ఎలాంటి స్పైక్ రాకపోవడం గమనార్హం. స్పైక్ రాకపోయినప్పటికీ బంతి గమనం మారడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై యశస్వి జైస్వాల్ తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలోనే ఒకే ఏడాదిలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఈ ఏడాది అతడు 1,478 పరుగులు చేశాడు. సచిన్ (2010లో) 1,562 పరుగులు, సునీల్ గావస్కర్ (1979లో) 1,555 పరుగులు చేశారు. వీరేంద్ర సహ్వాగ్ రెండుసార్లు 1,400+ పరుగులు చేసిన బ్యాటర్ కావడం విశేషం.
స్నికో ఆపరేట్ చేసే బీబీజీ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిధి వారెన్ బ్రెన్నన్ స్పందిస్తూ.. ‘‘ఆ షాట్ ఆడినప్పుడు ఎలాంటి శబ్దం రాలేదు. అందుకే, స్పికోలో స్పైక్‌రాలేదు. దీని గురించి ఆడియో డైరక్టర్‌తో మాట్లాడా. అతడు కూడా ఇదే విషయం వెల్లడించాడు. అందుకే, హాట్ స్పాట్‌తో సమస్యకు పరిష్కారం దొరికినట్లుంది’’ అని వెల్లడించారు. సైమన్ టౌఫెల్ మాట్లాడుతూ.. ‘‘నా ఉద్దేశం ప్రకారం అది ఔట్. థర్డ్ అంపైర్ నిర్ణయం సరైందే. టెక్నాలజీ సాయంతో బంతి గమనాన్ని అంపైర్లకు తెలుసుకొనే వీలుంది. ఇక్కడ అదే ఆధారం’’ అని తెలిపారు.