బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన.. యశస్వి జైశ్వాల్ (159 బంతుల్లో 63 రన్స్), రిషభ్ పంత్ (93 బంతుల్లో 28 రన్స్) పోరాడటంతో టీమిండియా టెస్టును డ్రా చేసుకునే దిశగా పయనిస్తోంది. ఐదో రోజు టీ బ్రేక్ సమయానికి 112/3తో నిలిచింది. ఇంకా కనీసం 38 ఓవర్లు ఆట సాగే అవకాశం ఉంది. భారత్ విజయానికి ఇంకా 228 పరుగులు అవసరం కాగా.. ఆస్ట్రేలియాకు 7 వికెట్లు కావాలి. ఈ నేపథ్యంలో ఈ టెస్టు డ్రా అయ్యేలా కనిపిస్తోంది.
కాగా 228/9తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో ఆరు పరుగులు జోడించి ఆలౌట్ అయింది. 234 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 340 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ ఛేజింగ్‌లో రోహిత్ (9), కోహ్లీ (5), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు. దీంతో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత్. అప్పటికీ ఇంకా సుమారు 70కి పైగా ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. దీంతో ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్లు పడగొట్టేలా కనిపించారు.
కానీ సీనియర్లు విఫలమైన అదే పిచ్‌పై యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్‌లు నిలబడ్డారు. మ్యాచ్‌ను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో రెండో సెషన్‌లో టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 27.5 ఓవర్లలో 79 రన్స్ స్కోరు చేసింది. వీరిద్దరూ 169 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మరి చివరి సెషన్‌లో భారత బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. నాలుగో టెస్టు కూడా డ్రాగా ముగిస్తే.. ఐదో టెస్టు నిర్ణయాత్మక టెస్టుగా మారనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే.. ఇరు జట్లకూ ఈ టెస్టు సిరీస్ గెలవడం కీలకం. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మెల్‌బోర్న్‌లో ఓడిపోకూడదని ప్రయత్నిస్తున్నాయి. ఐదో టెస్టు సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.