బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మరోసారి విఫలమయ్యారు. 340 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. డ్రా చేసుకోవాలన్నా.. కనీసం 90 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు.. జ్టును ముందుండి నడిపిస్తారని అంతా భావించారు. కానీ గత కొన్నేళ్లుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న వీరు.. మరోసారి విఫలమయ్యారు. దీంతో జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో నెట్టింట "హ్యాపీ రిటైర్మెంట్" అనే పదం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
కాగా 228/9తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో ఆరు పరుగులు జోడించి ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 340 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ ఛేజింగ్‌లో రోహిత్ 9, కోహ్లీ 5 పరుగులకే ఔటయ్యారు. అయితే జైశ్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్.. నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 39 బంతులు ఎదుర్కొన్నా.. వికెట్ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత బంతికే కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ అయ్యాడు. అదే ఓవర్‌లో కేఎల్ రాహుల్ కూడా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ.. కాసేపు నిలబడ్డాడు. కానీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యడు. ఆఫ్‌స్టంప్ అవతల పడ్డ బంతిని వేటాడే బలహీనతను కొనసాగించి మరోసారి పెవిలియన్ చేరాడు.
రోహిత్, కోహ్లీలు ఔట్ కావడంపై ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎక్స్‌లో "హ్యాపీ రిటైర్మెంట్" వైరల్‌గా మారింది. "కోహ్లీ, రోహిత్ శర్మలు భారత జట్టును చాలా మ్యాచుల్లో గెలిపించారు. వారిపై మాకు గౌరవం ఉంది. కానీ వారు టెస్టుల నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "నిజంగా చెబుతున్నా.. కోహ్లీ మానసికంగా కుంగిపోయాడు. ఒకప్పటిలా ఆత్మవిశ్వాసంతో లేడు. నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. 'హ్యాపీ రిటైర్మెంట్' అని కోహ్లీని ఉద్దేశించి మరొకరు కామెంట్ చేశారు.
ఇంకొందరేమో.. రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్ గైర్హాజరీలో.. బుమ్రా కెప్టెన్సీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బుమ్రానే కెప్టెన్‌గా ఉండి ఉంటే.. సిరీస్‌ను కూడా గెలిచేవాళ్లమని పేర్కొంటున్నారు. క్రితం సారి కూడా రహానే, పంత్, అశ్విన్, విహారీలే జట్టును గెలిపించారని పేర్కొంటున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ విమర్శలపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.