గొంతులో గారె ఇరుక్కుని ఊపిరాడక ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విస్మయానికి గురిచేసే ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో మొక్కా తిరుపతమ్మ (80)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వారికి వివాహాలు చేసిన తిరుపతమ్మ.. పెద్ద కొడుకు రామకృష్ణ ఇంటి సమీపంలోని చిన్న గదిలో ఒంటరిగా ఉంటోంది. ఆమె చిన్న కుమారుడు శ్రీను కూడా అదే ఊళ్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండగ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం తన ఇంటిలో వండిన గారెలను తల్లి తిరుపతమ్మకు ఇచ్చివెళ్లాడు.
అతడు వెళ్లిపోయిన తర్వాత ఆ గారెలను తింటుండగా గొంతులో ఇరుక్కునిపోయింది. దీంతో వృద్ధురాలు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత పెద్ద కుమారుడు కుటుంబసభ్యులు దీనిని గమనించి అచేతనంగా పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. దీనిపై కుమార్తె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు తల్లాడ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గారె ముక్క గొంతుకు అడ్డంపడి చనిపోయిందా? లేదా ఏదైనా కారణం ఉందా? అనేది దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు.
గతంలో చికెన్, ఇడ్లీ, చపాతీ ముక్కలు గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. గత నవంబరులో చపాతీ ముక్క గొంతుకు అడ్డంపడి.. సికింద్రాబాద్‌లో ఆరో తరగతి విద్యార్ధి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే, అక్టోబర్ నెలాఖరులో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దోసె గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. వెంకటయ్య అనే వ్యక్తి మద్యం సేవించిన అనంతరం దోసె తిటుండగా.. అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఇబ్బందులు పడిన వెంకటయ్య.. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఏ ఆహారమైనా సరే తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. గొంతులో ఇరుక్కుంటే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు